Share News

చేనేతకు తీపి కబురు

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:57 PM

రాష్ట్రంలోని నేత కార్మికులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురును అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు ఆర్థికభరోసా కల్పించేందుకు సిద్ధమైంది. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.

చేనేతకు తీపి కబురు
మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు (ఫైల్‌)

రుణమాఫీకి సర్కారు కసరత్తు

జిల్లా వ్యాప్తంగా రుణాల వివరాల సేకరణ

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు

జిల్లావ్యాప్తంగా రూ. 3.50 కోట్ల రుణాలు

త్వరలోనే మాఫీని అమలు చేయనున్న ప్రభుత్వం

జనగామ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నేత కార్మికులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురును అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు ఆర్థికభరోసా కల్పించేందుకు సిద్ధమైంది. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణాలను 2017లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాఫీ చేయగా తాజాగా 2017 తర్వాత తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో చేనేత, జౌళి శాఖ అధికారులు జిల్లాల వారీగా రుణాలు పొందిన చేనేత కార్మికులు, రుణ మొత్తం ఎంత అన్న వివరాలను సేకరించారు. జనగామ జిల్లావ్యాప్తంగా రుణం తీసుకున్న కార్మికుల వివరాలను అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి పంపించారు.

రూ. 3.5 కోట్ల రుణాలు..

జనగామ జిల్లావ్యాప్తంగా 12 మండలాల పరిధిలో సుమారు 3వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. జనగామ జిల్లాకేంద్రంతో పాటు బచ్చన్నపేట, కొడకండ్ల మండలాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉంటారు. చేనేత వృత్తి నమ్ముకొని జిల్లాలో వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వృత్తిని సాగించుకునేందుకు గానూ చేనేత కార్మికులు గతంలో ప్రభుత్వం నుంచి రుణాలను పొందారు. జిల్లాలో 700 మంది చేనేత కార్మికులు వ్యక్తిగత చేనేత రుణాలను తీసుకున్నారు. ఈ రుణం మొత్తం విలువ రూ.3.50 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.

చేనేత కార్మికుల్లో ఆనందం..

రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల రుణమాఫీని చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఎన్‌ఐహెచ్‌టీ) ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 9న ఈ ప్రకటన చేశారు. కాగా.. సీఎం ప్రకటనతో అధికారులు రుణమాఫీపై కసరత్తును ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా రుణగ్రహీతల వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో రుణమాఫీపై చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో 2010 నుంచి 2017 మార్చి వరకు తీసుకున్న చేనేత రుణాలను మాఫీ చేసింది. కాగా.. ప్రస్తుత ప్రభుత్వం 2017 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.

రుణమాఫీపై కొంత అస్పష్టత

చేనేత రుణమాఫీపై నేత కార్మికుల్లో కొంత అస్పష్టత నెలకొంది. మాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. దీంతో మాఫీకి ఎవరు అర్హులు, ఏ ప్రాతిపదికన మాఫీ చేస్తారన్న దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. చేనేత రుణమాఫీ చేస్తానని సీఎం ప్రకటించిన నేపథ్యంలో మరమగ్గాల కార్మికులు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అదేవిధంగా 2017 ఏప్రిల్‌ తర్వాత తీసుకున్న రుణాలను కొంత మంది కార్మికులు తిరిగి చెల్లించారు. దీంతో వారికి తిరిగి ఖాతాల్లో మాఫీ మొత్తాన్ని ప్రభుత్వం వేస్తుందా అన్నది కూడా తేలాల్సి ఉంది.

Updated Date - Jan 04 , 2025 | 11:57 PM