చేయూతనిచ్చి.. భరోసా కల్పిస్తూ
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:29 AM
గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్(పేదరిక నిర్మూలన సంస్థ) సంయుక్తంగా రాష్ట్రంలోనే తొలిసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహిళా సంఘాల ఉత్పత్తులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రదర్శనకు ఏర్పాటుచేశారు. ‘
మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు మినీ సరస్ ఫెయిర్
ఆకట్టుకుంటున్న హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, చేనేత దుస్తులు
8వ తేదీ వరకు నిర్వహణ
గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్(పేదరిక నిర్మూలన సంస్థ) సంయుక్తంగా రాష్ట్రంలోనే తొలిసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహిళా సంఘాల ఉత్పత్తులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రదర్శనకు ఏర్పాటుచేశారు. ‘మినీ సరస్ ఫెయిర్- 2025’ పేరిట ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన మహిళలు, యువతులను ఆకట్టుకుంటోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులను ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్లో వారి కుటుంబసభ్యులు కూడా భాగస్వాములవుతున్నారు. గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలు జాతీయ స్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ ఫెయిర్‌కు శ్రీకారంచుట్టారు. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన మినీ సరస్ 8వ తేదీ వరకూ కొనసాగనుంది. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులన్నీ ప్రదర్శనల ద్వారా విక్రయిచడంతో పాటు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేయడం కోసం కార్యాచరణ రూపొందించారు.
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో మొత్తం 42 స్టాల్స్ ఏర్పాటుచేశారు. నల్లగొండ జిల్లా నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి 30 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. సూర్యాపేట జిల్లానుంచి ఆరు, యాద్రాద్రి జిల్లా నుంచి ఆరు స్టాల్స్ ఏర్పాటుచేశారు. వీటిలో అద్భుతమైన హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, చేనేత ప్రదర్శనలు, మట్టి పాత్రలను విక్రయిస్తున్నారు. దేవరకొండ ప్రాంతంలోని గిరిజన మహిళలు తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తులు, పూసల వస్తువులు, ఎంబ్రాయిడరీ వర్క్స్ మహిళలను ఆకట్టుకుంటున్నాయి. అధికారులు ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్టాల్స్‌లో పెట్టిన పచ్చళ్లు కూడా ఎంతో రుచికంగా ఉన్నాయని స్టాల్స్‌ను సందర్శించిన ప్రజలు అభినందిస్తున్నారు.
మహిళా సంఘాలకు ప్రభుత్వం చేయూత
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రామీణాభివృద్ధి, సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు చేయూత అందిస్తోంది. మినీ సరస్ ఫెయిర్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ స్థాయికి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళలు కేవలం జిల్లా స్థాయిలో వ్యాపారానికి పరిమితం చేయకుండా వారికి పెట్టుబడులు కూడా రుణాలు కూడా అందించి వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిది ద్దడం కోసం పకడ్బందీగా మినీ సరస్ ఫెయిర్‌ను తీర్చిదిద్దారు. టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు నిర్వహిస్తున్నారు. నల్లగొండ పట్టణవాసులే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.
అధికారులు ప్రోత్సహిస్తున్నారు
బంజార ఉత్పత్తులు తయారుచేయడానికి అధి కారులు ప్రోత్సహిస్తున్నారు. అందమైన బ్యాగులు, అద్దాలతో అలంకరించిన వస్త్రాలు తయారుచేస్తు న్నాం. ఎంబ్రాయిడరీ వర్క్ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉంది. కుటుంబసభ్యులు కలిసి పనిచేస్తాం. అధికారులు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. సరస్ ఫెయిర్ ప్రదర్శనలో మా ఉత్పత్తులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ముడావత్ గాడి, శ్రీశివుడు బంజారా మహిళా సంఘం దేవరకొండ
చేనేతకు చేయూత లభిస్తుంది
చేనేత రంగానికి చేయూత లభిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. కుటుంబసభ్యుల ప్రోత్సా హం ఉంది. మెప్మా సహకారంతో ముందుకు సాగుతున్నాం. మొదటిసారిగా స్టాల్ ఏర్పాటు చేయడం ఎంతగానో సంతోషంగా ఉంది. ప్రజల నుంచి కూడా ఆదరణ ఉంది. మహిళలు ఇంటికే పరిమిత కాకుండా స్వశక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
ఏలె సుృతి, స్వశక్తి మహిళా సంఘం నల్లగొండ.
పూసలతో బ్యాగులను తయారు చేస్తున్నాం
మా సంఘం ఆధ్వర్యంలో పూసలతో బ్యాగులు, పర్సులు తయారుచేస్తున్నాం.ధరలు అందరికీ అందు బాటులో ఉండడంతో కొనుగోళ్లు అధికంగా జరు గుతున్నాయి. అధికారుల ప్రోత్సాహంతో సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. పూసలతో చేసిన బ్యాగులు, పర్సులు ఆకట్టుకుంటున్నాయి. మేము తయారు చేస్తున్న ఉత్పత్తుల కొనుగోళ్లతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాం.
ఎం. అనిత, శివసాయి సమభావన సంఘం తిప్పర్తి.