Share News

Teacher Promotions: గిరిజన ఉపాధ్యాయులకు బదిలీలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:48 AM

గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల

Teacher Promotions: గిరిజన ఉపాధ్యాయులకు బదిలీలు

  • పదోన్నతులూ చేపట్టేందుకు కసరత్తు

  • ప్రభుత్వానికి వివరాలు అందజేసిన గిరిజన సంక్షేమశాఖ

హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీలు, ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వానికి పంపింది. నారాయణపేట్‌ జిల్లా మినహా రాష్ట్రంలో గిరిజన విద్యార్థులకు 323 ఆశ్రమ పాఠశాలలు, 136 ప్రీ మెట్రిక్‌ వసతి గృహాలున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో లక్షమందికిపైగా గిరిజన విద్యార్థులు చదువుతుండగా.. ప్రీ మెట్రిక్‌ వసతి గృహాల్లో 45 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలల్లో 157 మంది పీజీహెచ్‌ఎంలు, దాదాపు 1200 మంది వరకు స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), మరో 2300 మంది వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ)లు పనిచేస్తున్నారు. వీరికి మిగిలిన ఉపాధ్యాయులతో కాకుండా ప్రత్యేకంగా పదోన్నతులు, బదిలీలను నిర్వహిస్తారు. స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి పీజీహెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించనున్నారు. గతంలో జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టేవాళ్లు. కానీ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీహెచ్‌ఎంలుగా పదోన్నతులు, వారి బదిలీలను కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. మిగిలిన క్యాడర్‌ ఎస్‌ఏ, ఎస్‌జీటీల బదిలీలను జిల్లా కలెక్టర్లే నిర్వహించనున్నారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైల్‌ను గిరిజన సంక్షేమశాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ అనుమతి రాగానే.. గతేడాదిలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆగస్టులోనే షెడ్యూల్‌ ఖరారు చేసుకుని గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి.. బదిలీలను నిర్వహించనున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 03:48 AM