Gandhi Hospital: గాంధీలో ఎక్స్‌రే రంధి
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:14 AM
చీలమండకు గాయమై.. ఉబ్బితే అది బెణికిందో.. విరిగిందో అని తెలుసుకోవడం క్షణాల్లో పని! ఎక్స్‌రే తీస్తే తెలిసిపోతుంది...
పెద్దాస్పత్రిల్లో పాడైపోయిన ఎక్స్‌రే యంత్రాలు.. 10 యంత్రాల్లో పనిచేస్తోంది రెండంటే రెండే
వాటిల్లోనూ ఫిల్మ్ రాదు.. ఫోన్లోనే ఫొటోలు
రోగుల క్యూ.. పడిగాపులతో తీవ్ర ఇబ్బందులు
అడ్డగుట్ట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): చీలమండకు గాయమై.. ఉబ్బితే అది బెణికిందో.. విరిగిందో అని తెలుసుకోవడం క్షణాల్లో పని! ఎక్స్‌రే తీస్తే తెలిసిపోతుంది. ఈ సమస్యతోనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వెళితే గనక అక్కడ ఎక్స్‌రే కోసం కొన్ని గంటలు పట్టొచ్చు.. లేదా, ఆ రోజు ఎక్స్‌రే తీయడమే సాధ్యపడకపోవొచ్చు. ఎందుకంటే.. రాష్ట్రంలోనే పెద్దాస్పత్రి అయిన గాంధీలో ప్రస్తుతం రెండంటే రెండు ఎక్స్‌రే యంత్రాలే పనిచేస్తున్నాయి. రోజుకు 1800 దాకా ఔట్ పేషంట్లు వచ్చే ఆ దవాఖానాలో ఎక్స్‌రే కోసం చాంతాడంత క్యూ ఉంటోంది. ఫలితంగా దూరప్రాంతాల నుంచి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్న నిరుపేద రోగులు ఎక్స్‌రే కోసం గంటలతరబడి పడిగాపులు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ఎక్స్‌రే యంత్రాలు గత రెండేళ్లుగా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఆస్పత్రిలో మొత్తంగా 10 ఎక్స్‌రే యంత్రాలున్నాయి. సెల్లార్‌లోని రేడియాలజీ విభాగంలో ఎనిమిది యంత్రాలు ఉంటే, ఓపీ విభాగంలో రెండున్నాయి. వీటిలో.. రేడియాలజీ విభాగంలో ఏడు యంత్రాలు, ఓపీ విభాగంలో ఒకటి పనిచేయడం లేదు. ప్రస్తుతం రెండు యంత్రాలే పనిచేస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్ ఉంటనే రిపోర్టులు
గాంధీ ఆస్పత్రిలో యంత్రాల కొరతతో ఎక్స్‌రే కోసం అవస్థలు పడుతున్న రోగులకు వచ్చిన మరో ఇబ్బంది ఏమిటంటే పరీక్ష అయ్యాక అక్కడి టెక్నిషియన్లు ఎక్స్‌రే ఫిల్మ్ ఇవ్వడం లేదు. ఎక్స్‌రే తీశాక స్మార్ట్‌ఫోన్ ఉందా? అని అడుగుతున్నారు. వారి నుంచి ఫోను తీసుకొని.. ఎక్స్‌రే రిపోర్టు ఫొటో, వీడియో తీసి ఇస్తున్నారు. అంటే.. సదరు రోగులు ఆ స్మార్ట్‌లోని ఫొటో, వీడియోను వైద్యులకు చూయించి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గాంధీకి వచ్చేది నిరుపేద రోగులే కావడం, వారిలో చాలామంది వద్ద మామూలు ఫోన్లే ఉండటంతో రిపోర్టు ఇవ్వలేం అంటూ టెక్నిషియన్లు చేతులెత్తేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రెండేళ్లుగా ఎక్స్‌రే ఫిల్మ్‌లు అందుబాటులో లేవని తెలుస్తోంది. మూలన పడిన ఎక్స్‌రే యంత్రాలను బాగు చేయించి.. ఫిల్మ్‌లు అందుబాటులో ఉంచాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు. ఎక్స్‌రే యంత్రాల విషయంలో గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ మరో విధంగా స్పందించారు. ఆస్పత్రిలో మొత్తం 12 ఎక్స్‌రే యంత్రాలు ఉన్నాయని, వీటిలో రెండు మాత్రమే రిపేరుకు ఉన్నాయని, మిగతావన్నీ పనిచేస్తున్నాయని చెప్పారు. రిపేరులో ఉన్న యంత్రాలను బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
మరమ్మతుల కోసం డబ్బులు చెల్లించాం
రేడియాలజీ విభాగంలో కొన్ని ఎక్స్‌రే, సీటీస్కాన్ యంత్రాలు పనిచేయడంలేదు. వీటికి మరమ్మతులు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీకి గతంలోనే డబ్బులు చెల్లించాం. కానీ ఆ కంపెనీ నుంచి టెక్నిషియన్లు రాకపోవడంతో మరమ్మతులకు జాప్యం అవుతుంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరగిణిస్తున్నాం. పాడైన ఎక్స్‌రే యంత్రాలను వెంటనే బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. - డాక్టర్ శేషాద్రి
ఎక్స్‌రే కోసం 10 గంటలు
నా భర్త మాణిక్‌రావు వారం క్రితం భవనంపై నుంచి కిందపడ్డాడు. నడుము విరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాం. నడుము విరగడంతో 6న సాయంత్రం ఎక్స్‌రే తీయించేందుకు ఆయన్ను రేడియాలజీ విభాగానికి స్ట్రెచర్‌పై తీసుకొచ్చాను. అక్కడ ఒకటే యంత్రం పనిచేస్తోంది. చాలాసేపటికి ఎక్స్‌రేకు అవకాశం వచ్చింది. ఫోన్‌లో ఫొటో తీసుకొని పైకి తీసుకెళితే.. వైద్యులు సరిగా రాలేదని, మళ్లీ ఎక్స్‌రే తీసుకొని రావాలని చెప్పారు. రెండోసారి ఆయన్ను తీసుకొని వెళ్లినా అదీ సరిగా రాలేదన్నారు. మర్నాడు అంటే.. ఏడో తేదిన మూడోసారి ఎక్స్‌రే తీయించుకొని వెళితే ఓకే చేశారు. ఇలా ఎక్స్‌రే తీయించడానికే 10 గంటలకు పైగా సమయం పట్టింది.
- పద్మ, మక్తల్