Harish Rao: రేవంత్ పాలనలో వైద్య కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకం
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:32 AM
బీఆర్‌ఎస్ హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలల భవితవ్యం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
ఎన్‌ఎంసీ తాఖీదులు ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలల భవితవ్యం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనల ప్రకారం లేవని పేర్కొంటూ.. ఈనెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఈ ఇద్దరూ జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యం వైద్య విద్యార్థులకు శాపంగా మారుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ ఇప్పుడు మేల్కొని దానిపై కమిటీ వేయడం హాస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనను గాలికొదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసానిస్తారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తక్షణమే మెడికల్ కళాశాలలకు నిధులు విడుదల చేసి, వైద్య విద్యార్థుల జీవితాలను నిలబెట్టాలని కోరారు.