NIMS Hospital: నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:03 AM
పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు బ్రిటన్ వైద్యులచే నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు.
నేటి నుంచి 21 వరకు బ్రిటన్ వైద్యులచే నిర్వహణ
నిమ్స్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు బ్రిటన్ వైద్యులచే నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 21 వరకు నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులను పరీక్షిస్తారు. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
నిమ్స్ పాత భవనం తొలి అంతస్తు సీటీవీఎస్ కార్యాలయంలో డా. అమరేష్ రావు, డా. ప్రవీణ్, డా. గోపాల్‌లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారుల తల్లిదండ్రులు సంప్రదించవచ్చని, పేషెంట్ల వారి పూర్వపు రిపోర్టులు, సీటీస్కాన్ రిపోర్టులు వారి వెంట తీసుకురావాలని బీరప్ప ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.