Share News

CM Relief Fund: సీఎం సహాయ నిధిని దొంగ పేర్లతో దోచేశారు

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:18 AM

వివిధ కారణాలతో ఆస్పత్రిపాలై అప్పులు చేసి బిల్లులు చెల్లించినవారు.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద సాయం పొందేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కొందరు పక్కదారి పట్టించారు.

CM Relief Fund: సీఎం సహాయ నిధిని దొంగ పేర్లతో దోచేశారు

  • కోదాడ మాజీ ఎమ్మెల్యే సిబ్బంది చేతివాటం

  • లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా అవే పేర్లు కలిగిన వ్యక్తుల ఖాతాల్లో జమ

  • ఆపై మొత్తాన్ని పంచుకున్న ముఠా

  • ఆరుగురి అరెస్టు..

సూర్యాపేట క్రైం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో ఆస్పత్రిపాలై అప్పులు చేసి బిల్లులు చెల్లించినవారు.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద సాయం పొందేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కొందరు పక్కదారి పట్టించారు. ఎమ్మెల్యే వద్ద సహాయకులుగా పనిచేస్తూ ఆయన ఇప్పించిన సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను లబ్ధిదారులకు దక్కకుండా దోచుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ వద్ద పనిచేసే సిబ్బంది ఈ అక్రమానికి పాల్పడ్డారు. లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను రీవ్యాలిడేషన్‌ చేయించుకుని అదే పేర్లతో ఉన్న వేరే వ్యక్తుల పేర.. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. ఆ వ్యక్తులకు కొంత కమీషన్‌ ఇచ్చి.. ఖాతాల్లోని మొత్తాన్ని తీసుకొని వాటాల కింద పంచుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను కోదాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.9.30 లక్షల నగదు, వాడని 8 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట ఎస్పీ కొత్తపల్లి నర్సింహ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. బొల్లం మల్లయ్యయాదవ్‌ క్యాంపు కార్యాలయంలో సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న చింతలపాలెం మండలం దొండపాడు గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి చెడపంగు నరేష్‌, పీఏగా పనిచేసే మేళ్లచెర్వు మండలం వేపల మాదారం గ్రామానికి చెందిన మర్ల వీరబాబు, మోతె మండలం సర్వారం గ్రామానికి చెందిన ఉప్పల మధు.. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేసే విషయాలను పర్యవేక్షించేవారు. 2023 నవంబరులో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వస్తుందని భావించి.. నరేష్‌, వీరబాబు, మధు, వారి వెంట తిరిగే మునగాల మండల నారాయణగూడెం గ్రామానికి చెందిన సూరగాని రాంబాబుతో కలిసి వివిధ పేర్లతో అప్పటికే మంజూరైన 44 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వకుండా పక్కన పెట్టారు.


పేర్లు మార్చి నగదు డ్రా..

హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వరంగల్‌ జిల్లా రంగశాయిపేటకు చెందిన గుంటుక సందీ్‌పను వీరంతా కలిశారు. అతడి ద్వారా చెక్కులను రీవ్యాలిడేషన్‌ చేయించి అదే పేర్లతో ఉన్న ఇతరులను చూసుకుని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. బ్యాంకు నుంచి నరేష్‌ మిత్రుడైన ప్రైవేట్‌ ఉద్యోగి రంగిశెట్టి వెంకటరావు ద్వారా డబ్బు డ్రా చేయించారు. వచ్చిన నగదును అందరూ కలిసి వాటాలు పంచుకున్నారు. మొత్తం 44 చెక్కులకు సంబంధించి రూ.15,83,500 విలువ కాగా, అందులో ఎనిమిది చెక్కులు వివిధ కారణాలతో విత్‌డ్రా కాలేదు. 36 చెక్కులకు సంబంధించి మొత్తం రూ.13.63 లక్షలు డ్రా చేసి నకిలీ లబ్ధిదారులకు కమీషన్‌ రూపంలో రూ.1.18 లక్షలు ఇచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి నిందితుల నుంచి రూ.9.30 లక్షల నగదుతోపాటు ఆరు వాడని చెక్కులు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 04:18 AM