Fraud: నకిలీ పాస్‌పుస్తకాలతో 16 లక్షల రుణాలు స్వాహా
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:45 AM
రైతులను మోసం చేసి, నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు ఇప్పిస్తున్న ముఠాను కురవి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మీడియాకు వెల్లడించారు.
ముగ్గురు నిందితుల అరెస్టు
కురవి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రైతులను మోసం చేసి, నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు ఇప్పిస్తున్న ముఠాను కురవి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మీడియాకు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మంచ్యాతండాకు చెందిన మూడ్ బాలాజీ, మహబూబాబాద్ మండలం అమనగల్ కస్నాతండాకు చెందిన బానోత్ హరికిషన్, జఫర్‌ఘడ్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన బానోత్ వర్ధన్ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు నకిలీ పాస్‌పుస్తకాలు, 1బీ, ఈసీ పత్రాలను తయారుచేసి అమాయకులైన రైతులకు ఎక్కువ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు.
ఒక్కో పాస్‌పుస్తకానికి రూ.10,000 చొప్పున వసూలు చేశారు. ఈ ముఠా కురవి యూనియన్ బ్యాంకు, డోర్నకల్ యూనియన్ బ్యాంకు, మహబూబాబాద్ యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకులలో మొత్తం 11 మంది రైతులకు రూ.16.90 లక్షల రుణాలు ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, మరో రూ.కోటి వరకు రుణాలు ఇప్పించేందుకు కూడా వీరు ప్లాన్ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్సై సతీశ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 23 నకిలీ పుస్తకాలు, ఒక ల్యాప్‌టాప్, రెండు ప్రింటర్లు, ఒక కంప్యూటర్, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.