Venkaiah Naidu: ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు
ABN , Publish Date - May 26 , 2025 | 04:42 AM
ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు అని, దానిని తుద ముట్టించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
ప్రపంచమంతా ఏకమై అంతం చేయాలి: వెంకయ్య
లండన్‌లో తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగం
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు అని, దానిని తుద ముట్టించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన లండన్‌లోని వీహెచ్‌పీ హిందూ సెంటర్‌లో బ్రిటిష్- భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని అన్నారు.
దీనికి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారని, భారతదేశం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అది 145 కోట్ల మంది భారతీయుల సంకల్పం, ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని కోరారు.