Darla Ramamurthy: ఉపాధి హామీ కూలీగా మాజీ సర్పంచ్
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:57 AM
ఇనుగుర్తి గ్రామ మాజీ సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఉపాధి హామీ పథకం కింద కూలీగా పనిచేసే దుస్థితికి చేరుకున్నారు. ఆయన సుమారు రూ.20 లక్షల బిల్లుల పెండింగ్ కారణంగా కుటుంబ పోషణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెండింగ్‌లో రూ.20 లక్షల బిల్లులు
కుటుంబ పోషణకు తప్పడం లేదన్న దార్ల రామ్మూర్తి
ఇనుగుర్తి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఆయన పేరు దార్ల రామూర్తి. ఇనుగుర్తి గ్రామ మాజీ సర్పంచ్. ఆయన మంగళవారం ఉపాధి హామీ పథకం కింద కూలీగా పనుల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇనుగుర్తి ఒకటి. గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులకు సుమారు రూ.20 లక్షల బిల్లులు బకాయిలున్నాయని రామ్మూర్తి తెలిపారు. ఆ అభివృద్ధి పనులు చేపట్టడానికి అప్పులు చేసి మరీ ఖర్చు చేశానని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వద్ద బిల్లులు బకాయిగా ఉండటంతో కుటుంబ నిర్వహణ కోసం తానూ తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇంటర్ వరకూ చదివిన రామ్మూర్తి గతంలో తెలుగు రచనా నైపుణ్యంతో జర్నలిస్టుగా పనిచేశారు. అయినా, ఇప్పుడు కుటుంబ పోషణ కోసం.. ‘అన్‌స్కిల్డ్’ పనులకూ వెళ్లడం విద్యావంతులను ఆలోచింపజేస్తోంది.