Former Minister Harish Rao : ‘ఫార్ములా-ఈ’లో కేటీఆర్‌ది తప్పేలేదు
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:40 AM
‘‘ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు.
కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారు: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. ఆయన ఏ తప్పూ చేయలేదు’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం నందినగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండోసారి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణ కోసం అడ్వాన్సు చెల్లించారని.. అందులో కేటీఆర్‌కు చేకూరిన లబ్ధి ఏమీ లేదన్నారు. ఆయనవైపు తప్పులేదు కాబట్టే విచారణకు సహకరిస్తున్నారని, తమకు న్యాయస్థానాలు, చట్టంపై గౌరవం ఉందని చెప్పారు. ఏసీబీ విచారణకు వెళితే ఆయన్ను 40 నిమిషాలు బయట నిల్చోబెట్టారని.. అయినా కేటీఆర్ ఓపికగా వ్యవహరించారన్నారు. ఇది కుట్రపూరితమైన కేసు అని, దీని నుంచి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రజలదృష్టిని మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వేధింపులు, కక్షసాధింపు చర్యలు ఎంతోకాలం సాగవన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా.. భయపడేదిలేదని, సీఎం రేవంత్ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిదని హరీశ్ రావు సూచించారు.