ENC B Hari Ram: మాజీ ఈఎన్‌సీ హరిరామ్ ఆస్తుల జప్తు
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:27 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి.హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం...
నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ
నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు
ఏఈఈ నికేశ్‌కుమార్ ఆస్తులు కూడా సీజ్
విజిలెన్స్ కమిషన్‌కు ఈఈ నూనె శ్రీధర్ ఫైలు
కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో రూ.40 వేల కోట్లకుపైగా పనులు
జప్తు కానున్న ఆస్తులు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో28 ఎకరాలు
షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు
మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్‌లో ఫ్లాట్లు
ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం
శ్రీనగర్ కాలనీలో రెండు ఇళ్లు
పటాన్‌చెరులో 20 గుంటలు
బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోట
కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం
కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలలో ఓపెన్ ప్లాట్లు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి.హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్‌తో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల హరిరామ్‌కు ఉన్న ఆస్తులను క్రయవిక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్‌ను అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో నీటిపారుదలశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు ఏసీబీ లేఖ రాయనుంది. అనంతరం హరిరామ్ ఆస్తుల క్రయవిక్రయాలను కట్టడి చేయనున్నారు. ఈ కేసు నుంచి బయటపడితే.. ఆస్తుల క్రయవిక్రయాలపై హరిరామ్‌కు అధికారం వస్తుంది. ఇక 2024 ఏప్రిల్‌లో హరిరామ్ నివాసం, జలసౌధలోని కార్యాలయం సహా మొత్తం 14 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది.
హరిరామ్ ఆధ్వర్యంలో 3 లింకుల పనులు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లు కాగా, అందులో రూ.48,665 కోట్ల అంచనా వ్యయం కలిగిన పనులు హరిరామ్ పర్యవేక్షణలో జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఏడు లింక్‌లు, 28 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. లింకులు-4, 5, 6 పరిధిలోని ప్యాకేజీలు 10 నుంచి 19 కిందికి వచ్చే పనులను హరిరామ్ చేయించారు. వాస్తవానికి ఈ మూడు లింకుల కింద వచ్చే పనుల అంచనా వ్యయం రూ.41,568.39 కోట్లే కాగా, తర్వాత అది రూ.48,665.54 కోట్లకు పెరిగింది. ఈ లింకుల పరిధిలోకి రాని ఇతర పనులను సైతం హరిరామ్ పర్యవేక్షించారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడైన మరో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) నికేశ్‌కుమార్ ఆస్తులను కూడా జప్తు చేస్తూ నీటిపారుదల శాఖ నోటి ఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో రికార్డుల ప్రకారం ఆస్తుల విలువ రూ.17.73 కోట్లుగా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్‌లో అది రూ.100 కోట్లపైనే ఉంటుందని తేల్చారు. ఒక సీఈ(చీఫ్ ఇంజనీర్)కి బినామీ ఆస్తులుగా వీటిని గుర్తించారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో నిందితుడైన మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్ ఫైలు సోమవారం విజిలెన్స్ కమిషన్‌కు చేరింది. ఆయనపై చర్యలు తీసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఫైలును విజిలెన్స్ కమిషన్‌కు పంపించారు.