Share News

Krishna River: కృష్ణమ్మ కదిలె!

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:33 AM

కృష్ణమ్మ జలసిరిని సంతరించుకుంటోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. ఆల్మట్టిలోకి 80 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.

Krishna River: కృష్ణమ్మ కదిలె!

  • ఆల్మట్టి, నారాయణఫూర్‌ గేట్ల నుంచి దిగువకు వరద

  • జూరాలలోకి 40వేల క్యూసెక్కులు.. 52వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

  • శ్రీశైలంలోకి 45వేలు, సాగర్‌లోకి 11వేల క్యూసెక్కులు

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ జలసిరిని సంతరించుకుంటోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. ఆల్మట్టిలోకి 80 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. 27, 967 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... ప్రస్తుతం జలాశయంలో 68.55 టీఎంసీల నీరు ఉంది. దిగువన నారాయణపూర్‌ ప్రాజెక్టులోకి 29,800 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 25,063 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలకు 40 వేల క్యూసెక్కులు, తుంగభద్రకు 43 వేల క్యూసెక్కులకు వరద వస్తోంది. 52,468 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 7.224 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది.


జూరాల ఎగువ కేంద్రంలో ఐదు యూనిట్ల ద్వారా 34.713 మిలియన్‌ యూనిట్లు, దిగువ కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా 38.506 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 42 వేల క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌లోకి 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను, 847.10 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుతం 73.9870 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర ఔరంగబాద్‌ శివారులోని పైటన్‌ పట్టణంలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టులోకి 819 క్యూసెక్కులు, సింగూరులోకి 600 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 599 క్యూసెక్కులు, మిడ్‌మానేరులోకి 125 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లిలోకి 454 క్యూసెక్కుల వరద వస్తోంది.

Updated Date - Jun 20 , 2025 | 04:33 AM