Fire Safety Awareness: అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:37 AM
అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా, ప్రమాదం జరిగేటప్పుడు అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం అని ఆయన చెప్పారు
హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా
అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని హోం శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఆ శాఖ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను అగ్నిమాపక శాఖ డీజీ వై. నాగిరెడ్డితో కలిసి రవిగుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల సమయంలో ఏ ఒక్కర్ని కాపాడినా.. మొత్తం కుటుంబాన్ని కాపాడినట్లే అవుతుందని చెప్పారు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా ఎలా ఎదుర్కోవాలనేది అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి తప్పించుకోవచ్చని రవిగుప్తా వివరించారు. అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన సామాన్య ప్రజలకు, మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బాధితుల్ని సురక్షితంగా బయటకు తీసుకురాగలమని చెప్పారు.