Telangana Floods: సవాళ్లను అధిగమించి సహాయక చర్యలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:31 AM
ఎడతెరిపి లేని వర్షాల వల్ల వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సవాళ్లను అధిగమించి సహాయక చర్యలు చేపట్టామని అగ్నిమాపక శాఖ డీజీ వై. నాగిరెడ్డి తెలిపారు.
1,646 మంది బాధితులు సురక్షిత ప్రాంతాలకు..
అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేని వర్షాల వల్ల వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సవాళ్లను అధిగమించి సహాయక చర్యలు చేపట్టామని అగ్నిమాపక శాఖ డీజీ వై. నాగిరెడ్డి తెలిపారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్లా, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని అనేక ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఇలా విపత్కర పరిస్థితులు ఎదురైనా సిబ్బంది బాధితులకు సహాయం అందించారన్నారు. మొత్తం 1,646 మంది బాధితుల్ని రక్షించామని పేర్కొన్నారు. కామారెడ్డిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది వాహనంతో సహా వరద నీటిలో కొట్టుకుపోయినా వారికి ఉన్న నైపుణ్యంతో సురక్షితంగా బయటకు రాగలిగారన్నారు.
అయితే కామారెడ్డిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించడంలో అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో కొందరు అవాస్తవ ప్రచారం చేయడం సరైంది కాదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. అగ్నిమాపక శాఖపై తప్పుడు ప్రచారాన్ని ఆ శాఖ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది.