సాగర్ అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:27 AM
నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మం డలం మూలతండా వద్ద నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మంటలు చెలరేగాయి.

సుమారు 15ఎకరాల్లో పాక్షికంగా దగ్ధం
మంటలు ఆర్పిన అటవీ సిబ్బంది
తిరుమలగిరి(సాగర్), ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మం డలం మూలతండా వద్ద నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మంటలు చెలరేగాయి. సుమారు 15 ఎకరాల్లో పాక్షికంగా అటవీ ప్రాంతం దగ్ధమైంది. అటవీ శాఖ సెక్షన్ అధికారి రమేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మూలతండా సమీపంలోని అడవిలో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఎయిర్ బ్లోయర్లతో మంటలు ఆర్పారు. అప్పటికే 15ఎకరాల్లో పాక్షికంగా చెట్లతో పాటు ఏపుగా పెరిగిన ఎండుగడ్డి కాలిపోయిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పశువులను, మూగ జీవాలను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వచ్చిన వ్యక్తులు సిగరెట్, బీడీలను కాల్చివేయడంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.