Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదుకు ఆదేశించండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:05 AM
ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని పేర్కొంటూ కె.అరవింద్‌రెడ్డి అనే న్యాయశాస్త్ర విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో పిటిషన్ దాఖలు
పోలీసులు వైఖరి తెలపాలన్న ధర్మాసనం
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని పేర్కొంటూ కె.అరవింద్‌రెడ్డి అనే న్యాయశాస్త్ర విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.శరత్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బాధ్యత కలిగిన శాసనమండలి సభ్యుడు ఒక కులంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంలో అశాంతికి దారితీస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేయడం లేదన్నారు. వాదనలు విన్న ఽధర్మాసనం.. హోంశాఖ, డీజీపీ, ఇతర పోలీసు అధికారులు ఈ అంశంపై తమ వైఖరి చెప్పాలని పేర్కొంటూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.