Volvo Bus Accident: లారీ-వోల్వో బస్సు ఢీకొని నలుగురి మృతి
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:12 AM
ఓవర్‌టేక్ చేస్తుండగా ట్రైలర్ లారీని వోల్వో బస్సు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురు క్షతగాత్రులయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం, కాటవరం స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
పాలమూరు జిల్లా కాటవరంలో ఘటన
జోగులాంబ జిల్లాలో నిమజ్జనానికి వెళ్తున్న
ట్రాక్టర్‌ని ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి
మూసాపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓవర్‌టేక్ చేస్తుండగా ట్రైలర్ లారీని వోల్వో బస్సు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురు క్షతగాత్రులయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం, కాటవరం స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి 32 మంది ప్రయాణికులతో ఏపీలోని ప్రొద్దుటూరుకు బయటుదేరిన వోల్వో బస్సు.. సోమవారం తెల్లవారుజామున 2.30గంటలకు 44వ జాతీయ రహదారిపై.. కాటవరం స్టేజీ వద్దకు చేరుకుంది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ముందు ఇనప చువ్వలతో వెళ్తున్న ట్రైలర్ లారీని వోల్వోబస్సు ఢీకొంది. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జవ్వడంతో.. బస్సు క్లీనర్, ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కొత్తపల్లి హసన్(39), ప్రయాణికులు-- నంద్యాలకు చెందిన అష్రాఫ్ ఉన్నీసా బేగం(70), ఎల్లమ్మ(39) దుర్మరణంపాలయ్యారు.
నంద్యాలకు చెందిన సుబ్బారావు గోస్పాడ్(45)అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలవ్వగా.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఏపీలోని నంద్యాలకు చెందిన సురేశ్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన జోషి, ఆళ్లగడ్డకు చెందిన ఓబులేశ్, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వీరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఎల్లమ్మ భర్త రాజారెడ్డి ఏడాదిక్రితం దాయాదులతో గ్రామం లో జరిగిన ఘర్షణలో మృతిచెందారు. ఎల్లమ్మ హైదరాబాద్‌లోని ఓ టిఫిన్‌సెంటర్‌లో పనిచేస్తుండగా.. ఆమె మరణంతో ఏడేళ్ల కుమారుడు సంతోష్ అనాథగా మారాడు. ఎల్లమ్మ మృతదేహం వద్ద సంతోష్ ‘‘అమ్మా.. అమ్మా..’’ అంటూ విలపించడం అక్కడి వారిని కలిచివేసింది.