Share News

అందని నీరు.. ఆందోళనలో రైతులు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:13 AM

మూసీ కుడికాల్వ ఆయకట్టులోని 9వ నెంబర్‌ డిస్ట్రిబ్యూటరీ కాల్వ పరిధిలో గల సాగు భూములకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందని నీరు.. ఆందోళనలో రైతులు

కేతేపల్లి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మూసీ కుడికాల్వ ఆయకట్టులోని 9వ నెంబర్‌ డిస్ట్రిబ్యూటరీ కాల్వ పరిధిలో గల సాగు భూములకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉప్పలపహాడ్‌ గ్రామ శివారులో భాగ్యనగర్‌ సమీపంలోని కొప్పోలు రెగ్యులేటరీ వద్ద నుంచి కుడి ప్రధాన కాల్వ రిడ్జ్‌కెనాల్‌ పేరిట రెండుగా చీలుతుం ది. ఒకటి చెరుకుపల్లి, తుంగతుర్తి, ఎల్లమ్మగూడెం, చిరుమర్తి వైపు వెళుతుండగా, మరొకటి కొప్పోలు, భీమారం, మాడ్గులపల్లి మండలంలోని పాములపహాడ్‌ వైపు వెళుతోంది. భీమారం వైపు వెళ్లే రిడ్జ్‌కెనాల్‌పైన 8, 9నెంబరు డిస్ట్రిబ్యూటరీలున్నాయి. కొప్పోలు రెగ్యులేటరీ వద్ద నుంచి భీమారం వచ్చే కాల్వకు కుడి ప్రధాన కాల్వలో గల రిడ్జ్‌ జంక్షన్‌ నుంచి నీటి విడుదల తక్కువగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఈ రిడ్జ్‌కెనాల్‌కు అరకొరగా వచ్చే నీరు పాములపహాడ్‌ వైపునకు వెళ్లే 8వ నెంబరు డిస్ట్రిబ్యూటరీకి ఎక్కువ మోతాదులో నీరు వెళ్లేలా అక్కడి రైతులు అక్రమ ంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఈ క్రమంలో భీమారం వైపునకు నీటిని అందించే 9వ నెంబరు డిస్ట్రిబ్యూటరీకి తగినంత నీరు అందడంలేదని కొన్ని రోజులుగా భీమారం రైతులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మూసీ కుడి కాల్వ ఏఈ మమత స్థానిక రైతులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. 9వ నెంబరు డిస్ట్రిబ్యూటరీ కాల్వకు మూసీ నీరు సక్రమంగా రాక ఎండిన తమ పంట పొలాలను రైతులు మూసీ కుడికాల్వ ఏఈ మమతకు చూపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది పంటకాలం పూర్తయ్యే వరకూ చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఏఈని కోరారు. కాల్వలో నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించే కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో తమ పంటలు ఎండిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ ఉంటే తమకు ఎలాంటి సమస్య ఎదురుకాదన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలో నీరు ప్రవహించక పంటలు ఎండిన తీరును గమనించిన ఏఈ మమత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 9వ నెంబరు డిస్ట్రిబ్యూటరీకి నిర్ణీత మోతాదులో నీరు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఏఈ వెంట స్థానిక నాయకులు బడుగుల నరేందర్‌యాదవ్‌, రైతులు జిల్లల యాదగిరి, బాలకృష్ణ, గండికోట గోపాల్‌, కొరివి బాలస్వామి, జిల్లెల వెంకన్న ఉన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:13 AM