విద్యుత్ లైన్ పనులను అడ్డుకున్న రైతులు
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:39 PM
లక్షెట్టిపేట మండలం జెండవెంకటాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నుంచివెంకట్రావుపేట సబ్‌స్టేషన్ వరకు చేపట్టనున్న 33కేవీ విద్యుత్ లైన్ పనులను జెండవెంకటాపూర్ రైతులు సోమవారం అడ్డుకున్నారు.

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట మండలం జెండవెంకటాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నుంచివెంకట్రావుపేట సబ్‌స్టేషన్ వరకు చేపట్టనున్న 33కేవీ విద్యుత్ లైన్ పనులను జెండవెంకటాపూర్ రైతులు సోమవారం అడ్డుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో దానికి సంభందించి కరెంటు స్తంభాలను కూడా వేశారు కానీ అప్పటి నుంచిఇప్పటి వరకు స్తంభాల నుంచి విద్యుత్ వైర్లు వేయడంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అధికారులు సోమవారం స్తంబాల నుంచివైర్లు వేసేందుకు జెండవెంకటాపూర్ గ్రామానికి వెళ్లంతో గ్రామ రైతులు పనులను అడ్డుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలు పొట్ట దశ లో ఉన్నాయని వైర్లు అమర్చే సమయంలో పంటలు దెబ్బతింటాయని 45 రోజులు గడిస్తే పంటలు కోసుకుంటామని పంటలను కోసిన తర్వాత పనులు చేపట్టాలని డిమాండ్ చేసారు. పనులు చేపడితే ఊరుకునేది లేదంటూ పనులను అడ్డుకున్నారు. రానున్నది వేసవికాలం పనులు చేపట్టకపోతే రైతులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు ఎంత చెప్పిన రైతులు ససే మిరా అన్నారు. రైతులు ఎంతకూ వినకపోవడంతో విద్యుత్ శాఖ ఏఈ గణేష్ పోలీసులకు సమాచారం అందించారు. లక్షెట్టిపేట ఎస్సై సతీష్ సిబ్బందితో గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడి ఆందోళనకారులకు నచ్చజెప్పి సముదాయించారు. రైతులు సాగు చేసే పంటలకు ఏలాంటి నష్టం జరుగకుండా పనులు చేప ట్టాలని విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని ఆదేశించడంతో ఎట్టకేలకు 33కేవి పనులు సజావుగా పూర్తి చేశారు విద్యుత్ అధికారులు సిబ్బంది.