Share News

Agricultural Crisis: యూరియా కోసం రైతుల వెతలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:54 AM

ఓవైపు వానాకాలం పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయం.. మరోవైపు అవసరానికి సరిపడా రాష్ట్రానికి రాని యూరియా. దీంతో ఎక్కడికక్కడ యూరియా కొరత ఏర్పడింది. ...

Agricultural Crisis: యూరియా కోసం రైతుల వెతలు

పంపిణీ కేంద్రాల వద్ద భారీగా బారులు.. వర్షంలో సైతం క్యూలో నిలబడి నిరీక్షణ

  • రాష్ట్రానికి సరిపోయేంతగా రాని యూరియా

  • ఎకరాకు ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ

  • వేల సంఖ్యలో క్యూ కడుతున్న రైతులు

  • కొద్ది మందికే అందుతుండడంతో ఆందోళన

  • పలు చోట్ల రాస్తారోకో చేపట్టిన అన్నదాతలు

  • టోకెన్లు జారీ చేసి యూరియా ఇవ్వండి

  • అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఓవైపు వానాకాలం పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయం.. మరోవైపు అవసరానికి సరిపడా రాష్ట్రానికి రాని యూరియా. దీంతో ఎక్కడికక్కడ యూరియా కొరత ఏర్పడింది. వ్యవసాయ సహకార సంఘాలకు, ఆగ్రో రైతుసేవా కేంద్రాలకు వస్తున్న యూరియా.. స్థానిక అవసరాలకు ఏమాత్రం సరిపోయేదిగా లేకపోవడంతో వచ్చిన కొద్దిపాటి యూరియా కోసం రైతులు పోటీ పడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పంపిణీ కేంద్రాలకు వందల సంఖ్యలోనే యూరియా బస్తాలు వస్తుండడం, రైతులు మాత్రం వేల సంఖ్యలో వస్తుండడంతో అందరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అధికారులు ఎకరానికి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నా.. అందుబాటులో ఉన్న యూరియా అందరికీ సరిపోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల రైతులు యూరియా అందడం లేదంటూ రోడ్డెక్కారు. ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వచ్చి వారిని సముదాయించాల్సి వచ్చింది. అయితే యూరియా పంపిణీ కేంద్రాలకు రైతులందరినీ ఒకేరోజు రప్పించకుండా.. టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు.

BDHF.jpg


తోపులాటలు.. ఆందోళనలు..

మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం వర్షంలోనే గంటల తరడి క్యూలో నిలుచున్నారు. చివరికి ఓపిక నశించి ఆందోళనకు దిగారు. చిల్‌పచెడ్‌ మండలం సోమక్కపేట పీఏసీఏస్‌ వద్ద తోపులాట చోటుచేసుకుంది. యూరియా కోసం రైతులు ఎగబడడంతో పోలీసులు వారిని నిలువరించారు. లారీలో 500 బస్తాలు మాత్రమే రాగా.. అవి ఎవరికీ సరిపోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పీఏసీఎ్‌సకు 560 బస్తాల యూరియా రాగా.. సుమారు 3వేల మంది క్యూలో నిలబడ్డారు. అధికారులు కేవలం 280 మందికే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి సముదాయించారు. హుస్నాబాద్‌లో రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో యూరియా కోసం రైతులు సోమవారం తెల్లవారుజామున 4గంటల నుంచే క్యూ కట్టారు. తల్లాడలో పోలీసు బందోబస్తు మధ్య టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు. ప్రైవేటు దుకాణాల్లో కూడా యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

BNTD.jpg

ఎల్కతుర్తిలో సమస్య తీర్చిన మంత్రి పొన్నం..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో యూరియా కోసం రోజుల తరబడి క్యూ కట్టినా దొరక్కపోవడంతో రైతులు ఆగ్రహించారు. వంద మందికి పైగా రైతులు సోమవారం హనుమకొండ-కరీంనగర్‌ ఎన్‌హెచ్‌-563పైకి చేరుకుని ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో గంట వ్యవధిలో యూరియా లారీ ఎల్కతుర్తి సొసైటీకి చేరుకుంది. రైతులు క్యూ కట్టి బస్తాలను తీసుకెళ్లారు. తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామంలో ఆగ్రోస్‌ కేంద్రం వద్ద రైతులు యూరియా కొరతపై ఆందోళన చేపట్టారు. అయితే వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారమే యూరియా సరఫరా అవుతోందని పీఏసీఎస్‌ సీఈవో తెలిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సింగిల్‌ విండో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు వర్షంలో తడుస్తూనే నిరీక్షించారు. చివరికి తమ చెప్పులను క్యూలో పెట్టి సమీపంలోని చెట్ల కింద వేచి ఉన్నారు. డబ్బులిచ్చి కొనుక్కునే యూరియాకు కూడా ఇంత కొరత ఉంటే పంటల సాగు ఎలా సాధ్యమవుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో వరంగల్‌ నుంచి భద్రాచలం వెళ్లే 365 జాతీయ రహదారిపై రైతులు రెండు గంటలపాటు బైఠాయించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడ్నుంచి పంపించివేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Updated Date - Aug 19 , 2025 | 03:54 AM