Share News

Farmers Stage Roadblocks: యూరియా కోసం రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:10 AM

నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ...

Farmers Stage Roadblocks: యూరియా కోసం రైతుల రాస్తారోకో

  • పలు చోట్ల బారులు తీరిన రైతులు

(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌): నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. దీంతో రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా పరిమితంగా ఉండడంతో సహకార సంఘాల వద్దకు సోమవారం ఉదయమే వచ్చి చెప్పులు, ఇతర వస్తువులను వరుసలో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామంలో రైతులు యూరియా కోసం కరీంనగర్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సైదాపూర్‌ మండలం ఆకునూర్‌ గ్రామంలోని ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజర్‌ వద్ద కొందరు రైతులకు యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్‌, రాచర్లతిమ్మాపూర్‌, అల్మా్‌సపూర్‌ గ్రామాల్లోని గోదాంల వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయం, పెద్దలింగాపూర్‌, ముస్కానిపేట, పొత్తూరు గ్రామాల్లో విక్రయ కేంద్రాల వద్ద యూరియా బస్తాలు తక్కువగా ఉండటం.. రైతులు ఎక్కువ మంది రావడంతో నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. చందుర్తి, సనుగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట యూరియా కోసం రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌, పాలకుర్తి మండలం పుట్నూర్‌లో రైతులు యూరియా కోసం బారులు తీరారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం ప్రాథమిక సహకార సంఘానికి ఒక లోడు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో కాసేపు తోపులాట చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం పుట్నూర్‌ కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు.

Updated Date - Aug 12 , 2025 | 06:10 AM