Farmers Protest: చెరువులు నింపాలని రోడ్డెక్కిన రైతులు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:39 AM
జనగామ మండలంలోని చెరువులు, కుంటలను నింపాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓబుల్ కేశవపూర్, పసరమడ్ల, సిద్దెంకి, పెద్దరాంచర్ల, శామీర్‌పేట గ్రామ రైతులు బుధవారం
కాళ్లు మొక్కుతా అన్నా కనికరించని ఈఈ: రైతులు
జనగామ రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జనగామ మండలంలోని చెరువులు, కుంటలను నింపాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓబుల్ కేశవపూర్, పసరమడ్ల, సిద్దెంకి, పెద్దరాంచర్ల, శామీర్‌పేట గ్రామ రైతులు బుధవారం జిల్లా కేంద్రంలోని వడ్లకొండ రోడ్డులోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఈఈ మంగీలాల్‌ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, పశువులకు కూడా నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాదుల ద్వారా చెరువులు నింపాలని ఇరిగేషన్ ఈఈ మంగిలాల్‌కు పలుమార్లు కోరినా, కాళ్లు మొక్కుతామన్నా పట్టించుకోకుండా అవమానించారని ఆరోపించారు. మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులతో అనుచితంగా ప్రవర్తించిన మంగీలాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని, అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడించి మూడు రోజుల్లో సాగు నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించుకున్నారు.