Share News

వరి వైపు రైతుల మొగ్గు

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:36 AM

జిల్లా వ్యాప్తంగా యాసంగిలో వరి సాగుకు ఎక్కువ శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందుతుండడంతో యాసంగిలో వరి నాట్లు ఎక్కువగా వేశారు.

వరి వైపు రైతుల మొగ్గు

-జల వనరులు పుష్కలంగా ఉండడమే కారణం

-జిల్లాలో 2,50,720 ఎకరాల్లో వరి నాట్లు

జగిత్యాల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా యాసంగిలో వరి సాగుకు ఎక్కువ శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందుతుండడంతో యాసంగిలో వరి నాట్లు ఎక్కువగా వేశారు. ఫలితంగా గత యేడాది సాధారణ సాగు కంటే అధికంగా సాగైనట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ముప్పాతిక శాతానికి పైగా విస్తీర్ణంలో వరినే సాగు చేస్తున్నారు. జిల్లాలో శ్రీరాంసాగర్‌ కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీరు అందుబాటులో ఉండడంతో రైతులు వరి సాగును పెంచారు. ఏ చెరువు కట్ట కింద చూసినా వరి నాట్లు దర్శనమిస్తున్నాయి.

ఫకాలువలు, చెరువుల్లో సమృద్ధిగా నీరు

వానాకాలం సీజన్‌లో కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, చెరువులు నిండుకుండల్లా మారడంతో వాటి ఆయకట్టు కింద రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు అధికంగా ఉండడంతో యాసంగి సాగు అంచనాలకు మించి జరుగుతోంది. అయితే యాసంగి కావడంతో రైతులు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేస్తున్నారు. దీంతో యూరియాకు డిమాండ్‌ పెరిగింది. అన్ని మండలాల్లోని ప్రాథమిక సహకార కేంద్రాల వద్ద యూరియా సరఫరాకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఫతగ్గిన మొక్కజొన్న సాగు

జిల్లాలో ఈసారి మొక్కజొన్న సాగు తగ్గింది. కొన్ని రోజులుగా వ్యవసాయ అధికారులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. జిల్లాలో 71 క్లస్టర్లలో ఏఈఓలు ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. రైతులు వేసిన పంటల విస్తీర్ణాన్ని బట్టి వ్యవసాయ దిగుబడులు ఏ మేరకు వస్తాయో అంచనా వేస్తారు. దీని ఆధారంగా ఆయా పంటల సాగును బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తారు.

జిల్లాలో సాగైన పంటల వివరాలు

ఫ వరి 2,50,720 ఎకరాలు

ఫ మొక్కజొన్న 34,106 ఎకరాలు

ఫ జొన్న 287 ఎకరాలు

ఫ అనుములు 3 ఎకరాలు

ఫ శనగలు 30 ఎకరాలు

ఫ పల్లి 252 ఎకరాలు

ఫ ఆవాలు 129 ఎకరాలు

ఫ పెసర 34 ఎకరాలు

ఫ సజ్జ 16 ఎకరాలు

ఫ మినపప్పు 152 ఎకరాలు

పకడ్బందీగా పంటల వివరాలు నమోదు

-రాంచంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సాగవుతున్న వివిధ పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఏఈవోలు పర్యటించి పంటల వివరాలను సంబంధిత యాప్‌లో పొందుపరుస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో అత్యధికంగా వరి పంట సాగు అవుతోంది. నీటి లభ్యత కారణంగా రైతులు వరి సాగుకు ముందుకు వస్తున్నారు.

Updated Date - Jan 29 , 2025 | 01:36 AM