కోర్టులో ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం చేసిన మాయలేడి అరెస్టు
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:02 AM
తాను న్యాయవాదిని, జడ్జీనని చెప్పుకుంంటూ.. కోర్టుల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు బురిడీ కొట్టించిన మాయలేడి బండారం బయటపడింది.
న్యాయవాదిని, జడ్జినంటూ బురిడీ
నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయల వసూలు
నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
యూసుఫ్‌గూడ/కరీంనగర్ క్రైం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తాను న్యాయవాదిని, జడ్జీనని చెప్పుకుంంటూ.. కోర్టుల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు బురిడీ కొట్టించిన మాయలేడి బండారం బయటపడింది. సుమారు 100 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో ఆమెను హైదరాబాద్ యూసు్‌ఫగూడలోని మధురానగర్ పోలీసులు శనివారం రాత్రి (మే 31న) కరీంగనగర్‌లో ఆమెను అరెస్టు చేశారు. సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బితుకు ప్రసన్న రెడ్డి న్యాయవాది. ఆమె ప్రస్తుతం అంబర్‌పేటలో ఉంటోంది. తాను న్యాయవాదిని, జడ్జీని అని చెప్పుకుంటూ తన భర్తతో కలిసి అక్రమ దందాకు తెరతీసింది. 2022లో హైకోర్టులో ఉద్యోగ నియమకాల కోసం విడుదలయిన కోటిఫికేషన్‌ను ప్రసన్న రెడ్డి ఆయుధంగా మలుచుకుంది. డబ్బులిస్తే హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తానంటూ పరిచయస్తుల దగ్గర నమ్మబలికింది. దాంతో వెంగళ్‌రావు నగర్‌కు చెందిన ఎస్. జీవన్.. ప్రసన్న రెడ్డిని కలిశాడు. రూ.15 లక్షలు ఇస్తే కోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. ఈ క్రమంలో జీవన్ ఆమెకు రూ. 6.5 లక్షలు ఇచ్చాడు. అనుమానం రాకుండా కోర్టులో నల్లకోటుతో ఉన్న ఫొటోలను అతనికి పంపేది. మిగతా రూ.8.5 లక్షలు వసూలు చేసేందుకు శైలజారెడ్డి అనే మహిళను హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసింది. ఆమె తన అసిస్టెంట్‌గా ఫిరోజ్ ఖాన్‌ను పరిచయం చేసి డబ్బులు వసూలు చేయించేది. కాలం గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో జీవన్‌లో అనుమానం మొదలైంది. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి ప్రసన్న రెడ్డి చేతుల్లో మోసపోయడని, ఉద్యోగం కోసం ఆమెకు రూ.4.50 లక్షలు ఇచ్చాడని జీవన్‌కు తెలిసింది. మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు బాధితులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కరీంనగర్‌లోని శ్రీ విల్లా్‌సలో ఉన్న ప్రసన్న రెడ్డిని శనివారం రాత్రి అరెస్టు చేయగా.. ఆమెను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఆమె భర్తనూ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రసన్న రెడ్డిపై గతంలో బంజారహిల్స్, మలక్‌పేట, చిక్కడపల్లి, జగిత్యాల, మల్యాల పోలీ్‌సస్టేషన్లలోనూ కేసులు నమోదయినట్లు తెలిసింది.
జడ్జినంటూ వేములవాడ ఆలయంలో ప్రత్యేక దర్శనం
తాను హైకోర్టు జడ్జినంటూ వేములవాడ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పి తనకు భద్రత కల్పించాలని ప్రసన్న రెడ్డి కోరింది. పోలీస్ ప్రొటెక్షన్, ప్రొటోకాల్‌తో దర్జాగా రాజన్న దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది. ఓ మహిళ భర్తతో గొడవ పడి దేవాలయానికి వస్తే.. ఆ మహిళను ప్రసన్న రెడ్డి అక్కడే పరిచయం చేసుకుంది. విడాకులు ఇప్పిస్తానని, హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె నుంచి రూ.3 లక్షలు కాజేసింది. అంతే కాక ఆమె ద్వారా ఆమె బంధువులు 10 మందినీ నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ప్రసన్నరెడ్డి చేతిలో మోసపోయిన వారిలో నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..