Extra Charges On Special Buses: ప్రత్యేక బస్సుల్లో రేపటి దాకా అదనపు చార్జీలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:25 AM
రాఖీ పండుగ సందర్భంగా వేసిన ప్రత్యేక బస్సుల్లో పెంచిన టికెట్ ధరలు సోమవారం వరకు
రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే: ఆర్టీసీ
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాఖీ పండుగ సందర్భంగా వేసిన ప్రత్యేక బస్సుల్లో పెంచిన టికెట్ ధరలు సోమవారం వరకు (ఆగస్టు 11) అమల్లో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారమే ప్రత్యేక బస్సులకు చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యేక బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రశంసించారు. సోదరభావానికి ప్రతీక అయిన రాఖీ పండుగను త్యాగం చేసి.. నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. గత రాఖీ పండుగ సందర్భంగా ఒక్కరోజే 63 లక్షల మంది, మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో 1.77 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారని చెప్పారు.