ఆస్తిపన్ను వసూళ్లకు కసరత్తు
ABN , Publish Date - Jan 20 , 2025 | 01:25 AM
బల్దియాల అభివృద్ధికి ఆస్తి పన్నుల చెల్లింపు ఊరటను ఇస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు, ఇతర పన్నుల వసూళ్లకు మరో 70 రోజులు మాత్రమే మిగిలింది.
- వంద శాతం లక్ష్యం దిశగా ప్రణాళిక
- 70 రోజలు గడువు
- సిరిసిల్ల, వేములవాడ బల్దియాల్లో అధికారుల దృష్టి
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
బల్దియాల అభివృద్ధికి ఆస్తి పన్నుల చెల్లింపు ఊరటను ఇస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు, ఇతర పన్నుల వసూళ్లకు మరో 70 రోజులు మాత్రమే మిగిలింది. ఈ ఆర్థిక సంవత్సరం 31వ తేదీలోగా వందశాతం పన్నుల వసూలు పూర్తి చేసి రాష్ట్రంలో మరోసారి ముందు వరుసలో నిలవడానికి జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిరిసిల్ల వేములవాడ మున్సి పాలిటీలు ఆస్తిపన్ను వసూళ్లలో ఏటా ముందంజలో ఉంటున్నారు. అదే ఆనవాయితీ కొనసాగించాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు.
మున్సిపాలిటీల్లో వసూళ్ల లక్ష్యం రూ.10.32 కోట్లు
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ బకాయిలు మినహాయిస్తే ప్రైవేటు ఆస్తి పన్నులకు సంబంధించి రూ.10.32 కోట్లు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ.6.22 కోట్లు వసూలు చేశారు. మిగిలిన బకాయిలు రూ.4.09 కోట్లు వసూలు చేస్తున్నారు. సిరిసిల్ల పరిధిలో 23,467 గృహాలు ఉండగా ఇందులో కమర్షియల్ రెసిడెన్షియల్ 2785, కమర్షియల్ 2566, గృహాలు 18,116 ఉన్నాయి. మొత్తం 23,467 గృహాలకు సంబంధించి రూ.6.22 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.13.07 లక్షలు పాత బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలుపై రూ.4.23 లక్షల జరిమానా విధించారు. ఇప్పటి వరకు రూ.3.78 కోట్లు వసూలు చేశారు. ఇందులో పాత బకాయిలు రూ.5.55 లక్షలు, పెనాల్టీకి సంబంధించి రూ.45 వేలు వసూలు చేశారు. మార్చి 31 వరకు రూ.2.44 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలు రూ.7.52 లక్షలు ఉన్నాయి. ఇప్పటి వరకు 60.75 శాతం వసూలు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 14,477 గృహాలు ఉండగా గృహాలు 11,153, కమర్షియల్ 2292, కమర్షియల్, గృహాలు కలిపి 1032 ఉన్నాయి. వీటికి సంబంధించి రూ.4.09 కోట్లు వసూలు చేసే లక్ష్యం నిర్దేశించారు. ఇందులో రూ.50.03 లక్షల బకాయిలు ఉన్నాయి. వీటిపై రూ.20.42 లక్షల జరిమానా ఉంది. ఇప్పటి వరకు రూ.2.44 కోట్లు వసూలు చేశారు. ఇందులో పాత బకాయిలు రూ.11.43 లక్షలు ఉన్నాయి. ఇంకా రూ.1.64 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 59.62 శాతం వసూలు చేశారు.
వసూళ్లపై పాలకవర్గాల ప్రభావం
సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలవడంలో పాలకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. వార్డుల్లో పన్నుల వసూళ్లు వంద శాతం పూర్తి చేసిన కౌన్సిలర్లను సన్మానించేవారు. కౌన్సిలర్ల ప్రమేయంతో రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఈనెల 26తో మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసిపోనుంది. 27 నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. సిరిసిల్ల బల్దియాలో 39 వార్డులు, వేములవాడలో 28 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులోనూ వంద శాతం పన్నుల వసూళ్లలో కౌన్సిలర్ల పాత్ర కీలకంగా ఉన్న దశలో ప్రస్తుతం పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత సిబ్బందికి సహకరించే వారు లేని పక్షంలో కొత్త సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు. అధికారులు కచ్చితత్వం పాటించడం ద్వారా ఇంటి పన్నులు చెల్లించే వారి మధ్య సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు.