Navodaya Schools: జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:15 AM
అర్బన్ జిల్లాగా ఉన్న హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన..
మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ పిల్
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అర్బన్ జిల్లాగా ఉన్న హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. ప్రస్తుతం ఉన్న తొమ్మిది నవోదయ పాఠశాలకు అదనంగా మరో 23 పాఠశాలలు ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జె. రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రం కొత్తగా ఏడు నవోదయ పాఠశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినా అడ్మిషన్ల నోటిఫికేషన్‌లో వీటిని చేర్చలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివరాలు తెలియజేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితిలకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.