National OBC Mahasabha: రాజకీయాలకు అతీతంగా బీసీలు ఐక్యం కావాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:48 AM
జాతీయస్థాయిలో బీసీలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత ఈటల రాజేందర్, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు పిలుపునిచ్చారు.
7న గోవాలో ఓబీసీ మహాసభను సక్సెస్ చేయాలి
ఈటల, అసదుద్దీన్ ఒవైసీ, వద్దిరాజుల పిలుపు
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో బీసీలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత ఈటల రాజేందర్, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7న గోవాలో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయడం ద్వారా బీసీల ఐక్యతను ప్రదర్శించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించనున్న 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈటల, అసదుద్దీన్, వద్దిరాజు ఆదివారం బీసీ సంఘం ప్రతినిధులతో కలిసి వేర్వేరుగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఒబీసీ మహాసభలకు హాజరు కావాలని కోరుతూ ఈటల, అసదుద్దీన్ ఒవైసీ, వద్దిరాజులకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్టు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో తమ వాటాను సాధించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నివర్గాల సమన్వయంతో ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు.