Voter List Errors: ఓటరు జాబితాలో.. తప్పుల కుప్పలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:04 AM
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వారీగా ఈ నెల 2న విడుదల చేసిన తుది ఓటర్ జాబితా ముసాయిదాలో కూడా మళ్లీ అవే తప్పులు దొర్లాయి.
తుది ఓటరు జాబితా ముసాయిదాలోనూ అదే తీరు
జాబితాల్లో చనిపోయిన ఓటర్ల పేర్లు
మహబూబ్‌నగర్/నిజామాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వారీగా ఈ నెల 2న విడుదల చేసిన తుది ఓటర్ జాబితా ముసాయిదాలో కూడా మళ్లీ అవే తప్పులు దొర్లాయి. మృతుల పేర్లు ఉండటం, ఒకే వ్యక్తికి రెండు ఓట్లు, వలస వెళ్లిన వారివీ ఉండటంతో అసలు ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల ఓటరు జాబితాలో క్షేత్రస్థాయిలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయి. మహబూబ్‌నగర్ పొల్కంపల్లిలో ఒక మహిళ ఫొటోతో ఆమె పేరు ‘‘ అ’’ , ఆమె తండ్రి పేరు ‘‘శ’’ అని ముద్రించారు. గండీడ్ మండలం రుసుంపల్లిలో 1200 ఓట్లు ఉండగా 46 మంది చనిపోయిన వారి పేర్లు జాబితాలో వచ్చాయి. పోతులమడుగు పంచాయతీ పరిధిలో 20 మంది చనిపోయిన వారి పేర్లు, 15 మంది వరకు పేర్లు తప్పుగా నమోదు కావడం కనిపించింది. గట్టు మండలం చాగదోనలో అశోక్ అనే పేరుకు బదులు అనొక్కు అని రావడం గమనార్హం. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కల్వకుర్తి మండలాల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్‌లోనూ.. ఇదే పరిస్థితి
ఇక, నిజామాబాద్ జిల్లా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. జిల్లాలోని డొంకేశ్వర్ మండలం మారంపల్లి గ్రామంలో హేమంత్ కుమార్ పేరు మీద ఒకే వార్డులో మూడు ఓట్లు వచ్చాయి. అదే గ్రామంలో పది మంది చనిపోయిన వారి ఓట్లను తొలగించలేదు. అన్నారం గ్రామంలో ఓటరు జాబితాలో రెండు సార్లు పేర్లు వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టి ఓటర్ల వివరాలు సేకరించడంతో పాటు మృతులు, వలస వెళ్లిన వారు, రెండు ఓట్లు ఉన్నవారి పేర్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.