ఇంటర్‌లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:24 AM
ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మొదటి సంవత్సరం, శనివారం రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం

జగిత్యాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మొదటి సంవత్సరం, శనివారం రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్ పరీక్షకు శ్రీకారం చుట్టింది. గతం యేడు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉండగా ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. మొత్తం 80 మార్కులు థియరీకి కేటాయించగా ప్రాక్టికల్ పరీక్షలకు 20 మార్కులు కేటాయించారు. నాలుగు దశల్లో నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 7 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులవుతారు. గైర్హాజరైన విద్యార్థులను అనుత్తీర్ణులుగా పరిగణిస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 31వ తేదీన, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనుండగా అందుకోసం విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ విద్యపై అన్ని రకాల విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన పరీక్ష, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు వచ్చే నెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
నాలుగు దశల్లో...
ఒక్కో దశలో నాలుగు మార్కుల చొప్పున, ప్రాక్టికల్ పరీక్షకు నాలుగు మార్కులు కలిపి మొత్తం 20 మార్కులు కేటాయించారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. అయితే థియరీలో 28 మార్కులు, ప్రాక్టికల్స్‌లో 7 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణలోకి తీసుకుంటారు. మొదటి దశలో ఏదైనా అంశంపై ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు సంభాషించుకునే తీరును అధ్యాపకులు పరీక్షిస్తారు. రెండో దశలో ఇక అంశంపై నిముషంలోపు అనర్ఘళంగా మాట్లాడాల్సి ఉంటుంది. మూడో దశలో తల్లిదండ్రులు లేదా మరేదైనా అంశపై విద్యార్థులు బృందంగా చర్చించాలి.
ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే
ఇంటర్ విద్యార్థుల్లో ఇంగ్లీష్ భయాన్ని పోగొట్టడానికి బోర్డు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలో విద్యార్థులు మూస పద్ధతిలో పరీక్ష నిర్వహించడం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌లో భాగంగా వారికి ఇష్టమైన టీచర్, ఆట గురించి ఏదో ఒక అంశం గురించి ఒక్క నిమిషం పాటు మాట్లాడాల్సి ఉంటుంది. వారి గురించి విద్యార్థులకు తెలిసిన విషయాలు, ప్రత్యేకతలపై 60 సెకన్ల పాటు ప్రసంగించాల్సి ఉంటుంది. ఇలాంటివి మొత్తం 30 అంశాలు ఇస్తారు. వీటిల్లో ఒక దానికి ఎంచుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ మూల్యాంకన పద్ధతుల్లో జస్ట్ ఏ మినట్ (జామ్) ఒకటికిగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే విద్యార్థులు నిమిషం పాటు ప్రసగించాల్సి ఉంటుంది. ఇక రోల్ ప్లేలో భాగంగా ఇద్దరు విద్యార్థులు ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల పాటు పరస్పరం సంభాషించాల్సి ఉంటుంది. ఉదాహరణకు దుకాణదారుడు...వినియోగదారుల మధ్య సంభాషన రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేటివ్ స్కిల్స్‌లో భాగంగా విద్యార్థి మాటలను ఒకటి లేదా రెండు నిమిషాలు పాటు రికార్డు చేస్తారు. దీనికి కూడా మార్కులు ఉంటాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించడానికి ఇంటర్ బోర్డు లెక్చరర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
- నారాయణ, జగిత్యాల ఇంటర్ విద్యాధికారి, జగిత్యాల
ఇంటర్ స్థాయి నుంచే ఇంగ్లీష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు గత ఏడాది నుంచి విద్యాశాఖ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ప్రవేశపెట్టింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 31వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీన రెండు విడతల్లో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షకు ఖచ్చితంగా హాజరుకావాలి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.