Jagdish Mittal: చిత్రకళా పరిశోధకుడు జగదీశ్ మిట్టల్ ఇకలేరు
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:39 AM
ప్రఖ్యాత చిత్రకళా పరిశోధకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, జగదీశ్ మిట్టల్ (99) ఇకలేరు.
భారతీయ చిత్రకళా రంగంలో విమర్శకుడిగా గుర్తింపు
హైదరాబాద్ సిటీ, జనవరి7 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత చిత్రకళా పరిశోధకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, జగదీశ్ మిట్టల్ (99) ఇకలేరు. కొద్ది రోజులుగా వయోధిక సమస్యలతో మంచానికే పరిమితమైన ఆయన దోమల్‌గూడలోని స్వగృహంలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. జగదీశ్ మిట్టల్ 1925 సెప్టెంబరు 16న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఓ విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చిత్రకళలపై మక్కువ కలిగిన ఆయన, విశ్వకవి రవీంద్రుడు నెలకొల్పిన శాంతి నికేతన్, కళాభవన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన సహాధ్యాయి, ప్రఖ్యాత చిత్రకారిణి కమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు భద్రి విశాల్ పిట్టి ఆహ్వానం మేరకు 1953లో హైదరాబాద్‌కు వచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో భారతీయ చిత్రకళ చరిత్రను కొంతకాలం బోధించా రు. క్రీ.పూ ఒకటవ శతాబ్దం మొదలు క్రీ.శ 1900 వరకు అరుదైన చిత్రకళా సంపదను సేకరించారు. తన భార్య కమల మరణానంతరం జగదీశ్ అండ్ మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్ పేరుతో 1976లో ఇంటినే మ్యూజియంగా మలిచారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జగదీశ్ మిట్టల్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.