Share News

Vikarabad: కొడుకులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌ను ఆశ్రయించిన తండ్రి

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:30 AM

తను రాసిచ్చిన భూమిని అనుభవిస్తున్నారు కానీ, వృద్ధులైన తల్లిదండ్రులను మాత్రం కొడుకులు పట్టించుకోవడం లేదని ఓ వృద్ధ తండ్రి కలెక్టర్‌ను ఆశ్రయించాడు.

Vikarabad: కొడుకులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌ను ఆశ్రయించిన తండ్రి

వికారాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తను రాసిచ్చిన భూమిని అనుభవిస్తున్నారు కానీ, వృద్ధులైన తల్లిదండ్రులను మాత్రం కొడుకులు పట్టించుకోవడం లేదని ఓ వృద్ధ తండ్రి కలెక్టర్‌ను ఆశ్రయించాడు. కన్న బిడ్డల తీరుతో మనస్తాపం చెందిన తండ్రి.. అనారోగ్యంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నా.. వాకర్‌ స్టాండ్‌ సహాయంతో వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో తన ఆవేదనను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చాడు. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలం చిట్టిగిద్దకు చెందిన బాపు నర్సింహారెడ్డి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకుల్లో ఒకరు జీహెచ్‌ఎంసీలో ఉద్యోగి కాగా, మరొకరు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.


నర్సింహారెడ్డి తన పేరిట ఉన్న 14 ఎకరాలను ఇద్దరు కొడుకుల పేరిట పట్టా చేయించాడు. అయితే, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత తమ బాగోగులు చూడడం మానేశారని వృద్ధుడు వాపోయాడు. రైతుభరోసా కూడా కొడుకుల బ్యాంకు ఖాతాల్లో జమవుతోందన్నాడు. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ప్రభుత్వం పేదలకు ఇచ్చే చేయూత పెన్షన్‌కు కూడా నోచుకోలేకపోతున్నామని, బతికే మార్గం లేక తమ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన నర్సింహారెడ్డి.. తనను ఆదుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు.

Updated Date - Sep 02 , 2025 | 02:30 AM