Share News

ED Investigates Fertility Clinic: సృష్టి లోకి ఈడీ ప్రవేశం

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:14 AM

సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

ED Investigates Fertility Clinic: సృష్టి లోకి ఈడీ ప్రవేశం

  • 80 మంది చిన్నారుల విక్రయం

  • నమ్రత 25 కోట్లు కొల్లగొట్టినట్లు హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ

  • వివరాల కోసం సిటీ పోలీసులకు ఈడీ లేఖ?!

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)’ రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో డాక్టర్‌ నమ్రత సుమారు 80 మంది చిన్నారులను విక్రయించడంతో రూ.25 కోట్లు చేతులు మారినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసు దర్యాప్తు వివరాలను తమకివ్వాలని హైదరాబాద్‌ నగర పోలీసులకు ఈడీ లేఖ రాసినట్లు సమాచారం. సిటీ పోలీసుల విచారణ నివేదికలో పూర్వాపరాలు పరిశీలించి దర్యాప్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌’ పేరుతో డాక్టర్‌ నమ్రత చేపట్టిన అక్రమాల దందాపై సికింద్రాబాద్‌- గోపాలపురం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తు న్న సంగతి తెలిసిందే. ఆమెకు అంతర్‌ రాష్ట్ర చైల్డ్‌ మాఫియా ముఠాలతో లింకులుండటంతోపాటు రూ.లక్షల్లో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. డాక్టర్‌ నమ్రతతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఐదుగురు డాక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర ఏజెంట్లు, చిన్నారులను విక్రయించిన దళారులు సహా 30 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నమ్రత, ఆమె కొడుకు జయంత్‌ కృష్ణతోపాటు సృష్టి క్లినిక్‌ పేరుతో గల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఆయా ఖాతాల్లో రూ.కోట్లలో డబ్బు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. అలా అక్రమంగా కొల్లగొట్టిన సొమ్ముతో 2 తెలుగు రాష్ట్రాల్లో స్థలాలు, ప్లాట్లు, ఫామ్‌ హౌస్‌లు కొనుగోలు చేసిన నమ్రత.. విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలిన నేపథ్యంలోనే ఈడీ రంగ ప్రవేశం చేసినట్లు తెలియవచ్చింది. పిల్లల్లేని దంపతులను సరగసీకి ఒప్పించి.. మరో మహిళ గర్భంలో మీ బిడ్డను పెంచుతున్నామని డాక్టర్‌ నమ్రత నమ్మించే వారు. డెలివరీ సమయం వచ్చేనాటికి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన చిన్నారులను.. సరగసీ ద్వారా పుట్టిన శిశువని సదరు దంపతుల చేతిలో పెట్టేవారు. అలా చికిత్స మొదలైనప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకూ ఆ దంపతుల నుంచి రూ.30-40 లక్షలు వసూలు చేసేవారు.

Updated Date - Aug 11 , 2025 | 05:14 AM