Sridhar Babu: బట్ట కాల్చి మీద వెయ్యడం కాదు వాస్తవాలు మాట్లాడాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:56 AM
హైదరాబాద్‌లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్) అంశంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. బట్ట కాల్చి మీద వెయ్యడం కాదనీ, కేటీఆర్ వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
టీడీఆర్ మొదలుపెట్టిందే కేటీఆర్
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఉప్పల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్) అంశంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. బట్ట కాల్చి మీద వెయ్యడం కాదనీ, కేటీఆర్ వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. ఉప్పల్ నియోజవర్గంలో సుమారు రూ.50 కోట్లతో చేపట్టిన వివిద అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీఆర్, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎ్‌ఫఎ్‌సఐ)లతో సీఎం రేవంత్‌రెడ్డి భారీ కుంభకోణానికి కుట్ర పన్నుతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు శ్రీధర్‌బాబు బదులిచ్చారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ఏదో బట్టకాల్చి తమపై వెయ్యడం వివేకం అనిపించుకోదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే టీడీఆర్‌ను ఆసరాగా చేసుకొని బాగుపడిన విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. టీడీఆర్ మొదలు పెట్టింది మీరే?అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి చెప్పారు.
ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంపై దృష్టి సారిస్తూనే దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్ బాబు వివరించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆశయం మేరకు హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అందులో భాగంగానే మూసీ ప్రక్షాళన చేపట్టామని తెలిపారు. ఉప్పల్ ప్రాంతంలో రూ.101 కోట్లతో చేపట్టబోయే ఎస్‌ఎన్‌డీపీకి పనులను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వచ్చే నెలలో ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఉప్పల్‌లో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా, మంత్రి శ్రీధర్‌బాబు ఉప్పల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రామంతాపూర్‌లో ఓ శిలాఫలకం ఆవిష్కరణ వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచరులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై బీఆర్‌ఎస్ అంటూ పోటాపోటీ నినాదాలు చేయడంతో పోలీసులు కలుగజేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..