South India Business Award: సింధూర నారాయణకు సౌత్ ఇండియా బిజినెస్ అవార్డ్
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:06 AM
విద్యారంగంలో చేసిన కృషికి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ దుబాయ్‌లో సౌత్ ఇండియా బిజినెస్ అవార్డ్-25 అందుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో చేసిన కృషికి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ దుబాయ్‌లో సౌత్ ఇండియా బిజినెస్ అవార్డ్-25 అందుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. పదేళ్లకు పైగా సినీ రంగానికి చెందిన వ్యక్తులను గౌరవిస్తున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంస్థ.. వ్యాపార రంగంలో ఉన్నత విలువలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డును అందిస్తోంది.
అవార్డ్ స్వీకరించిన సందర్భంగా సింధూర నారాయణ మాట్లాడుతూ.. ముందు ఉత్పత్తి చేసి దానికి మార్కెట్ వెతకడం కంటే ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడం ముఖ్యం అన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రతి విద్యా ర్థి సమగ్రాభివృద్ధి సాధించే విధంగా పాఠ్యప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. నారాయణ విద్యా సంస్థలు ఆసియాలో అతి పెద్ద విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ.. మీ కలలే మా కలలు అనే నినాదాన్ని నిజం చేస్తున్నామన్నారు. విద్యారంగంలో సింధూర నారాయణ చేసిన కృషిని నిర్వాహకులు ఈ సందర్భంగా కొనియాడారు.