SBI Employees: విలీనమైన బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనాల్లో వ్యత్యాసంపై వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:42 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఉద్యోగులకు, ఎస్బీఐలో విలీనమైన పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల
ఉద్యోగుల పిటిషన్‌లో ఆర్బీఐకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులకు, ఎస్బీఐలో విలీనమైన పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు మధ్య రిటైర్‌మెంట్, ఇతర ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉండటంపై వివరణ ఇవ్వాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐలో విలీనమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, మైసూర్, పాటియాలా, ట్రావెన్‌కోర్ తదితర బ్యాంకుల ఉద్యోగులకూ ఎస్బీఐ ఉద్యోగుల తరహాలోనే ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ పలువురు అధికారులతోపాటు ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్లు ఆయా రిటైర్‌మెంట్, ఇతర ప్రయోజనాలకు అర్హులుకారని పేర్కొంటూ సింగిల్ జడ్జి సదరు పిటిషన్‌ను కొట్టేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 10కి వాయిదా పడింది.