Unique Dining Airplane Restaurant: కదిలే విమానంలో విందు భోజనం
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:09 AM
మీరెప్పుడైనా విమానంలో విందు భోజనం చేశారా? మన దగ్గర విమానం ఎక్కినవారే తక్కువ, విందు భోజనం కూడానా అనిపిస్తోందా..
దుండిగల్/కుత్బుల్లాపూర్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మీరెప్పుడైనా విమానంలో విందు భోజనం చేశారా? మన దగ్గర విమానం ఎక్కినవారే తక్కువ, విందు భోజనం కూడానా అనిపిస్తోందా..! హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో డీపోచంపల్లికి వెళితే నిజమైన విమానంలో, నిజంగానే విందు ఆరగించవచ్చు. కాకపోతే గాలిలో ఎగురుతూ కాదు. భూమ్మీదే కాస్త కదులుతూ! అది ‘టెర్మినల్-1 రెస్టారెంట్’. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన వెంకట్రాంరెడ్డి దీనిని నిర్వహిస్తున్నారు.
దుబాయ్‌లో సుమారు 18 ఏళ్లపాటు హోటల్ వ్యాపారం చేసిన ఆయన.. కరోనా సమయంలో తిరిగి వచ్చేసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. పాత విమానాన్ని కొనుగోలు చేసి, హైడ్రాలిక్ పరికరాల సహాయంతో కదులుతూ, విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేవారికి ఎయిర్‌హోస్టె్‌సల తరహాలోనే స్వాగతం పలికి భోజనం వడ్డిస్తారు.