Share News

Health Services: డయాలిసిస్‌ దోపిడీ

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:38 AM

రాష్ట్రంలో ప్రభుత్వ డయాలిసిస్‌ సేవల పేరిట అడ్డగోలు దోపిడీ జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ఆయా కేంద్రాలకు భూమి, నీళ్లు, విద్యుత్తు అందిస్తోంది..

Health Services: డయాలిసిస్‌ దోపిడీ

  • ప్రైవేటు ఏజెన్సీలకు భారీగా ‘లాభం’

  • ఒక్కో డయాలిసి్‌సకు రూ.1820 చెల్లిస్తున్న ప్రభుత్వం

  • ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలకు రూ.1350

  • సర్కారీ కేంద్రాల్లో భారీగా ధర పెంపు.. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం

  • 2022 వరకు రూ.1375.. ఆ తర్వాత రూ.1820

  • అధికారులు, ఏజెన్సీలు మిలాఖతై పెంచుకున్నట్లు ఆరోపణలు

  • డయాలిసిస్‌ కేంద్రాలకు ఉచితంగా స్థలం, విద్యుత్తు, నీరు ఇస్తున్న సర్కారు

  • పీపీపీ పద్ధతిలో రక్తశుద్ధి సేవలు.. అడ్డగోలు పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం

  • పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధం.. రేట్లు తగ్గించే యోచన

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ డయాలిసిస్‌ సేవల పేరిట అడ్డగోలు దోపిడీ జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ఆయా కేంద్రాలకు భూమి, నీళ్లు, విద్యుత్తు అందిస్తోంది.. అటువంటప్పుడు ప్రైవేటు సెంటర్ల కంటే తక్కువ ధరకు సేవలు అందించాల్సిన డయాలిసిస్‌ కేంద్రాలు వాటికంటే ఎక్కువ రేట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి వసూలు చేస్తూ ఖజానాకు నష్టం కలిగిస్తున్నాయి. దీని వెనుక డయాలిసిస్‌ సేవలందించే ప్రైవేటు ఏజెన్సీల లాబీ, నాటి ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులతోపాటు ఆరోగ్యశ్రీలోని అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం తాజాగా ఆరా తీసినట్లు సమాచారం. త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరిపించటంతోపాటు పెంచిన ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలోనే కిడ్నీ పేషంట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్‌ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేశారు. వీటికి నెలవారీ బిల్లుల చెల్లింపు, పర్యవేక్షణ, ఆడిటింగ్‌, టెండర్లు మొదలైన పనులన్నింటినీ ఆరోగ్యశ్రీ ట్రస్టు చూస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ కేంద్రాల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 102 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాగా, వాటిలో 98 కేంద్రాలు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలో నడుస్తున్నాయి. వీటికి ప్రభుత్వమే స్థలం, నీళ్లు, కరెంటును ఉచితంగా అందిస్తోంది. యంత్రాల ఏర్పాటు, నిర్వహణ మాత్రం ప్రైవేటు ఏజెన్సీలు చూస్తున్నాయి.


ఒక పేషంట్‌ ఒక్కసారి డయాలిసిస్‌ చేయించుకుంటే ప్రభుత్వం.. సంబంధిత ఏజెన్సీకి రూ.1820 చెల్లిస్తోంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలను ప్రైవేటు ఆస్పత్రుల్లోని డయాలిసిస్‌ కేంద్రాలు అందిస్తే వారికి ప్రభుత్వం ఒక డయాలిసి్‌సకు రూ.1350 చొప్పున చెల్లిస్తోంది. అక్కడ నీళ్లు, కరెంటు, స్థలం అంతా సదరు ప్రైవేటు ఆస్పత్రి బాధ్యతే. అయినా, ప్రైవేటు కంటే సర్కారీ కేంద్రాలకే ఒక్కో డయాలిసి్‌సకు అదనంగా రూ.470 చెల్లిస్తున్నారు. రెండూ చోట్ల కూడా సింగిల్‌ డయాలైజర్స్‌నే వినియోగిస్తున్నారు. కానీ చెల్లిస్తున్న ధరలో మాత్రం భారీ వ్యత్యాసం. ఇది 2022 నుంచి జరుగుతోంది. ఆ ఏడాది అక్టోబరు వరకు డయాలిసి్‌సకు రూ.1375 చొప్పున చెల్లించారు. ఆ తర్వాత నుంచి రేట్లు పెంచేశారు.


క్రమంగా పెరిగిన ధర

2009-2016 మధ్య కాలంలో మల్టీ యూజ్‌ డయలైజర్‌కు రూ.1250 చొప్పున ధర నిర్ణయించారు. ఆ తర్వాత నుంచి ధర పెరుగుతూ వస్తోంది. 2017 నుంచి 2022 వరకు ఒకే కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్‌ సేవలు అందించింది. అనంతరం, మొత్తం మూడు క్లస్టర్లుగా విభజించి డయాలిసిస్‌ కేంద్రాలను వాటి పరిధిలోకి తీసుకొచ్చారు. గాంధీ ఆస్పత్రి పరిఽధిని ఒకటవ క్లస్టర్‌గా విభజించి దాని కిందికి 28 డయాలిసిస్‌ కేంద్రాలను తీసుకొచ్చారు. నిమ్స్‌ ఆస్పత్రి పరిఽధిలో రెండవ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీని కింద 43 కేంద్రాలున్నాయి. ఉస్మానియా పరిధిలో 3వ క్లస్టర్‌ ఉంది. దాని కిందకు 27 కేంద్రాలను అప్పగించారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. ఒకటవ క్లస్టర్‌లో ఒక డయాలిసి్‌సకు రూ.1375 ఇవ్వగా, 2వ, 3వ క్లస్టర్లలో రూ.1415 చొప్పున గత ప్రభుత్వం చెల్లించింది. 2022 నాటికి ఏజెన్సీ కాంట్రాక్టు సమయం ముగియడంతో మళ్లీ టెండర్లు పిలిచారు. మూడు కంపెనీలు టెండర్లను దక్కించుకున్నాయి. దాంతోపాటే రేటు కూడా భారీగా పెంచారు. 1వ, 3వ క్లస్టర్లలో ఒక్కో డయాలిసి్‌సకు రూ.1820గా, 2వ క్లస్టర్‌లో రూ.1794గా ధర నిర్ణయించారు. నాడు వైద్య ఆరోగ్యశాఖలోని కొందరు ఉన్నతాఽధికారులు, డయాలిసిస్‌ సేవలందించే కార్పొరేట్‌ ఏజెన్సీలు మిలాఖత్‌ అయి రేట్లను భారీగా పెంచేశారన్న ఆరోపణలు వచ్చాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే డయాలిసిస్‌ రేటు మాత్రం రూ.1350గానే ఉంది. దాంట్లో మార్పు లేదు.


మూడేళ్లలోనే రూ.560 కోట్ల చెల్లింపు

ప్రస్తుతం మూడు క్లస్టర్ల పరిఽఽధిలో 845 డయాలిసిస్‌ యంత్రాలు పని చేస్తున్నాయి. ఈ మూడు క్లస్టర్ల కింద 7 కేంద్రాల్లో ఐదు షిఫ్టులు, 41 కేంద్రాల్లో నాలుగు షిఫ్టులు, 50 కేంద్రాల్లో 2-3 షిప్టుల ప్రకారం డయాలిసిస్‌ సేవలందిస్తున్నారు. 1వ క్లస్టర్‌లో 1806 డయాలిసిస్‌ రోగులుండగా, 2వ క్లస్టర్‌లో 3104 మంది, 3వ క్లస్టర్‌లో 1796 మంది మొత్తం 6,706 మంది రోగులు రక్తశుద్ధి చేయించుకుంటున్నట్లు ఆరోగ్యశ్రీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటులో కూడా కలిపితే మొత్తం 11,893 మంది రోగులు డయాలిసిస్‌ చేయించుకుంటున్నారు. వీరందరికిగాను నెలకు సగటున 94,753 డయాలిసిస్‌ సెషన్స్‌ నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఈ సేవలకు అయిన మొత్తం వ్యయం రూ.1178 కోట్లు కాగా, గడిచిన మూడేళ్లలోనే ఇది దాదాపు సగం (రూ.560 కోట్లు) ఉండటం గమనార్హం. డయాలిసిస్‌ ధరలను భారీగా పెంచటం వల్లనే ఇది జరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి విచారణ జరిపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. డయాలిసిస్‌ ధరను తగ్గించే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated Date - Nov 17 , 2025 | 05:39 AM