Uttam Kumar Reddy: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:05 AM
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటి అని, రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని డెన్మార్క్ రాయబారి రాస్మస్ అబిల్డ్‌గార్డ్ క్రిస్టెన్‌సన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
బ్రూవరీలను విస్తరించండి
డెన్మార్క్ రాయబారిని కోరిన మంత్రి ఉత్తమ్
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటి అని, రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని డెన్మార్క్ రాయబారి రాస్మస్ అబిల్డ్‌గార్డ్ క్రిస్టెన్‌సన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం క్రిస్టెన్‌సన్, మంత్రి ఉత్తమ్‌ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా క్రిస్టెన్‌సన్‌ను ఉత్తమ్ కోరారు. కార్ల్స్‌బర్గ్, ఇతర డానిష్ సంస్థలకు రాయితీతో భూమి, నీటిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని, కొత్త బ్రూవరీలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయం, ఐటీ, ఔషదాలు, పునరుత్పాదక ఇంధనం, ఆహార ప్రాసెసింగ్‌లు పెట్టుబడులకు బలమైన రంగాలని, క్లీన్ ఎనర్జీ నుంచి పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలని సూచించారు. ఓఆర్‌ఆర్ బయట కొత్త పారిశ్రామిక, డేటా కారిడార్ జోన్‌లను ఏర్పాటు చేయనున్నామని, అతిపెద్ద రీజినల్ రింగ్‌రోడ్డులను వేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని ఆయనకు మంత్రి చెప్పారు.
ఇంధనం, ఫార్మా, పాడి పరిశ్రమలో పెట్టుబడులపై చర్చించారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.9 శాతమే అయినప్పటికీ జీడీపీలో 5శాతం వాటా కలిగి ఉందని.. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం దాదాపు 11 శాతం వృద్ధి రేటును న మోదు చేసిందని ఉత్తమ్ చెప్పారు. వచ్చే పదేళ్లలోపు తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి అనేక దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నామన్నారు. దేశానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఉందన్నారు. 120 కంటే ఎక్కువ దేశాలకు మందులు, వ్యాక్సిన్‌లు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. డెన్మార్క్ రాయబారి స్పందిస్తూ క్లీన్ ఎనర్జీ, వ్యవసాయం, నీరు, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నామని, డెన్మార్క్ కంపెనీలు బెంగుళూరుకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయన్నారు. మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి పరిశీలన చేస్తున్నామన్నారు.