Egg Supply: వాళ్లు ఆపేశారు.. వీళ్లు మొదలు పెట్టలేదు!
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:30 AM
‘ఆగస్టు 21లోపు అన్ని జిల్లాల కలెక్టర్లు కోడిగుడ్ల టెండర్లు పూర్తిచేసి.. ఎంపికైన కాంట్రాక్టర్లకు వెంటనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు గుడ్ల సరఫరా మొదలు పెట్టాలి.
రాష్ట్రవ్యాప్తంగా కోడిగుడ్ల సరఫరాలో గందరగోళం
ఇంకా 8 జిల్లాల్లో పూర్తికాని టెండర్ ప్రక్రియ
పూర్తయిన జిల్లాల్లో వర్క్ ఆర్డర్లు ఇవ్వని కలెక్టర్లు
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆగస్టు 21లోపు అన్ని జిల్లాల కలెక్టర్లు కోడిగుడ్ల టెండర్లు పూర్తిచేసి.. ఎంపికైన కాంట్రాక్టర్లకు వెంటనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు గుడ్ల సరఫరా మొదలు పెట్టాలి. గుడ్డు ధర రూ.6.30లకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఇవి అమలుకు నోచుకోలేదు. టెండర్ల ద్వారా కొత్తగా ఎంపికైన కాంట్రాక్టర్లు ఈ నెల 1 నుంచి గుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా.. రాష్ట్రంలో ఎక్కడా సరఫరా ప్రారంభమవలేదు. ఇప్పటికీ 8 జిల్లాల్లో పూర్తిస్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. టెండర్లు పూర్తయిన చాలా జిల్లాల్లో కలెక్టర్లు కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. వర్క్ ఆర్డర్లు పొందిన కాంట్రాక్టర్లు కూడా గుడ్లు సరఫరా చేయలేదు. దీంతో కొన్ని కేంద్రాల్లో గత నెలలో మిగిలిపోయిన గుడ్లను సర్దుబాటు చేస్తున్నారు. అలా లేని చోట్ల గుడ్ల పంపిణీ నిలిచిపోయింది. గుడ్డు ధర ఎట్టి పరిస్థితుల్లో రూ.6.30 కంటే మించొద్దని ప్రభుత్వం ఆదేశించినా కొందరు కలెక్టర్లు అంతకంటే ఎక్కువ ధరకు ఇవ్వడం విమర్శలకు దారితీసింది. కామారెడ్డి, భువనగిరి జిల్లాల్లో మంగళవారమే టెండర్ ప్రక్రియ పూర్తికాగా.. నిర్మల్‌లో ఇంకా కాంట్రాక్టర్లతో ధరపై బేరమాడుతూనే ఉన్నారు. హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. 8 జిల్లాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. కొత్త టెండర్లు పూర్తయ్యే వరకు పాత కాంట్రాక్టర్లే సరఫరా చేయాలనే నిబంధనల మేరకు గత నెల వరకు వాళ్లే గుడ్లు అందజేశారు. పెంచిన ధర పాతవాళ్లకు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వాళ్లెవరూ ఇప్పుడు సరఫరా చేయడానికి ముందుకు రావడం లేదు. కాగా, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాల కలెక్టర్లు ఏకంగా గుడ్డు ధర రూ.6.40 చొప్పున కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఇక వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రూ.6.39, ఆదిలాబాద్ జిల్లాలో రూ.6.36, నాగర్‌కర్నూలులో రూ.6.35 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు ఇచ్చారు. మరోవైపు వరంగల్ జిల్లాలో రూ.5.26, జయశంకర్ భూపాలపల్లిలో రూ.5.88లకే కాంట్రాక్టు ఇచ్చారు.
పక్కదారి పట్టకుండా వేర్వేరు రంగులు..
గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండడానికి గాను అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా చేసే కాంట్రాక్టర్లు గతంలో 15 రోజులకోసారి వేర్వేరు రంగులు వేసి, గుడ్లను సరఫరా చేసేవాళ్లు. కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాకో కాంట్రాక్టర్ ఆయా జిల్లాలోని కేంద్రాలన్నింటికీ గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. అంటే.. ఇప్పుడు ఎక్కువ గుడ్లు సరఫరా చేయాల్సి ఉండడం, వాటన్నింటికీ వేర్వేరుగా రంగులు వేయాలని పేర్కొనడం సమస్యగా మారింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లకు ఎలాంటి రంగులు వేయాలో ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖ స్పష్టం చేసింది. అయితే, గుడ్లకు వేర్వేరు రంగులు వేయడానికి కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదని తెలిసింది.