Ponguleti Srinivasa Reddy: కూలిపోయిన ఇళ్లు కట్టిస్తాం
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:08 AM
ర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూలిపోయిన ఇళ్లను తిరిగి కట్టిస్తామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: పొంగులేటి
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూలిపోయిన ఇళ్లను తిరిగి కట్టిస్తామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కేవలం గంట వ్యవధిలో 700 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, దీనివల్ల నీటివనరులు పూర్తిగా నిండిపోయి వరద నీరు ఉధృతంగా ప్రవహించిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
సిరిసిల్ల జిల్లా నర్మల గ్రామం వద్ద బుధవారం మానేరు వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురిని హెలికాప్టర్ ద్వారా రక్షించినట్లు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాలకు అత్యవసర ఖర్చుల నిమిత్తం వారం క్రితమే ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి విడుదల చేసిందన్నారు. భారీగా నష్టపోయిన జిల్లాలకు అదనపు నిధులు ఇస్తామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల ప్రలజను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బీఆర్‌ఎస్ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం సరికాదన్నారు.