Red Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:45 PM
మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 29: మొంథా తుపాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్ర తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మొంథా తుఫాను ప్రభావంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం సిద్దిపేట జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ హైమావతి హాలిడే ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.
కుండపోత వర్షాలకు వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో రహదారి చెరువును తలపించింది. ప్రధాన రహదారిపై చేరిన వరదతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆ రూట్ ని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ తడిసి ముద్దయింది. మంగళవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 20-25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 30-35 సెంటీమీటర్లకు చేరే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.
వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్ నగరంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్‌రోడ్, బట్టల బజార్ ఏరియాలు నీట మునిగాయి. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంచెత్తింది. శివనగర్‌లో రహదారిపై వరద నీటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ బస్టాండ్ చెరువును తలపించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా హనుకొండ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు సహాయక చర్యల కోసం 79819 75495 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..