Cyber Crime: డిజిటల్ అరెస్టు పేరుతో రూ.72 లక్షలకు టోకరా!
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:47 AM
మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో విచారణకు హాజరుకావాలి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అంటూ 82 ఏళ్ల వృద్ధుడిని బెదిరించిన సైబర్ కేటుగాళ్లు నిండా ముంచేశారు..
వృద్ధుడి నుంచి కాజేసిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్‌సిటీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ‘మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో విచారణకు హాజరుకావాలి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అంటూ 82 ఏళ్ల వృద్ధుడిని బెదిరించిన సైబర్ కేటుగాళ్లు నిండా ముంచేశారు.. ఆయన బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.72 లక్షలు కాజేశారు.. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ ధార కవిత వివరాల మేరకు.. బంజారాహిల్స్‌కు చెందిన వృద్ధుడికి ఇటీవల గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసునంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకుని.. బాధితుడి వ్యక్తిగత వివరాలన్నీ చెప్పి నమ్మించాడు. ‘మీరు ఆధార్ కార్డు దుర్వినియోగం చేశారు. మీపై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. రేపు మీ బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేస్తాం. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.. మీరు తప్పకుండా వర్చువల్‌గా హాజరుకావాలి’ అని బెదిరించాడు.
మరుసటి రోజు వీడియో కాల్ చేసిన నేరగాళ్లు.. సినిమాల్లోలాగా సుప్రీంకోర్టు సెటప్ వేసి నకిలీ జడ్జితో ప్రశ్నలు అడిగించారు. బాధితుడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఈ నేపథ్యంలోనే అతని ఖాతాల్లోని డబ్బును తాము చెప్పిన ఆర్బీఐ ఖాతాల్లోకి పంపాలని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తేలితే వెంటనే ఆయా ఖాతాలకు డబ్బులు తిరిగి బదిలీ చేస్తామన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. దీంతో బాధితుడు పది రోజుల పాటు తన బ్యాంకు ఖాతాల్లోని రూ.72 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే ఆ తర్వాత నుంచి వారి ఫోన్ నంబర్లు కలవకపోవడం.. ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన నకిలీ డిజిటల్ అరెస్టు వార్త చూసి ఇదంతా మోసమని బాధితుడు తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.