Cyber Crime: సైబర్ నేరగాళ్ల వలలో శాస్త్రవేత్త
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:50 AM
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ శాస్త్రవేత్తను బెదిరించి, ఏకంగా రూ.12.5 లక్షలు కాజేశారు.
రూ. 12.5 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
పటాన్‌చెరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ శాస్త్రవేత్తను బెదిరించి, ఏకంగా రూ.12.5 లక్షలు కాజేశారు. ఆధార్ ఆధారంగా తీసుకున్న సిమ్ కార్డుతో పబ్లిక్ హరా్‌సమెంట్ చేస్తున్నారని బెదిరించి ఈ మోసానికి పాల్పడ్డారు. పటాన్‌చెరు మండలంలోని పోచారం గ్రామం గణపతిగూడెంలో నివాసం ఉంటున్న ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త లక్ష్మణ్‌కు జూన్ 27న ముంబై నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ‘‘మీ ఆధార్ నంబర్‌తో తీసుకున్న సిమ్ నుంచి పబ్లిక్ హరా్‌సమెంట్ మెసేజ్‌లు వస్తున్నాయి.
మీపై 17 కేసులు నమోదయ్యాయి’’ అంటూ బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసు దుస్తుల్లో ఉన్న మరో వ్యక్తి వీడియో కాల్ చేసి ‘‘మీరు అక్రమంగా బ్యాంకు ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు’’ అని భయపెట్టాడు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే రూ. 42 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన శాస్త్రవేత్త, గత నెల 24న రెండు దఫాలుగా రూ.10 లక్షలు, ఈ నెల 5న రూ. 2.5 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన లక్ష్మణ్ పోలీసులను ఆశ్రయించారు.