Share News

యాదగిరికొండపై భక్తుల రద్దీ

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:29 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

యాదగిరికొండపై భక్తుల రద్దీ
గర్భాలయంలోని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల రద్దీ

భువనగిరి అర్బన్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు సుమారు 40వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారని అధికారులు తెలిపారు. ఉద యం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలల వద్ద రద్దీ నెలకొంది. భక్తులను కొండపైకి తరలించేందుకు అధికారులు తగినన్ని బస్సులు ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 44,14,051ల ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

శాస్త్రోక్తంగా నిత్య పూజలు

సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొల్పిన అర్చ కులు సంప్రదాయరీతిలో నిత్యపూజలు నిర్వహించారు. గర్భా లయంలో స్వయం భువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామి అమ్మవారికి నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. శివాలయంలో పర్వత వర్థిని సమేత రామలింగేశ్వర స్వామికి నిత్య పూజలు, రుద్ర హవన పూజలు, శైవాగమరీతిలో నిర్వహించారు. రాత్రి మహా నివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం చేశారు.

యాగశాలను పరిశీలించిన ప్రధానార్చకుడు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఈ నెల 19 నుంచి 22 వరకు మహాకుంభాభిషేకం, వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సంప్రోక్షణ నిర్వహించేందుకు ఆలయ ఉత్తర తిరువీధిలో ఏర్పాటు చేసిన యాగశాలను ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు ఆదివారం పరిశీలించారు. చంద్ర, త్రిభుజ, చతురస్ర, అర్ధచంద్ర, పద్మఆకారంలో ఐదు హోమకుండాలు ఏర్పాటు చేసి తుది మెరుగులు దిద్దారు. అనం తరం గరుడ పతాకాన్ని ఆవిష్కరించేందుకు, హోమ కుండాలకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియలో మరిన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పంచతల స్వర్ణగోపురాన్ని రుత్వికులు, వేద పండితుల వేదమంత్రాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలతో ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించినందున మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహి ంచేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

స్వాగత తోరణాలు ఏర్పాటు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహాశివరాత్రి, వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19న ప్రారంభమై మార్చి 11న ముగుస్తాయి. ఇందుకోసం క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్‌ కాంతులు విరజిమ్మేందుకు వీధి దీపాలు, ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత తోరణాల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాకేంద్రం, కలెక్టరేట్‌, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, యాదగిరిపల్లి ప్రధాన కూడళ్ల వద్ద భారీ స్వాగత తోరణాలు సిద్ధమవుతున్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రధాన రహదారి వెంట రథచక్రాలు వాటిపై పక్షులు, వివిధ ఆకృతులతో ఆకర్షణీయంగా ఆరు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ సివిల్‌ ఈఈ జిల్లెల దయాకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Feb 17 , 2025 | 12:29 AM