Khammam: పుచ్చలపల్లి మేనల్లుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:10 AM
సీపీఎం వ్యవస్థాపక నేత, దివంగత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు ఏపీలోని నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖరరెడ్డి(77) బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఖమ్మం క్రైం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సీపీఎం వ్యవస్థాపక నేత, దివంగత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు ఏపీలోని నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖరరెడ్డి(77) బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3:30గంటల సమయంలో ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటరితనమే ఆయన ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. చంద్రశేఖర్‌రెడ్డి భార్య 25 ఏళ్ల క్రితం మరణించారు. వారి ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు.
అయితే, 15రోజుల క్రితం ఆశ్రమాన్ని ఖాళీ చేశారు. కాశీ పర్యటన ముగించుకుని నెల్లూరు వెళుతున్నానని తనకు మనుమడు వరసయ్యే వ్యక్తికి మంగళవారం తెలిపారు. మంగళవారం రాత్రి ఖమ్మం రైల్వేస్టేషన్‌లో దిగిన ఆయన బుధవారం తెల్లవారుజామున ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.