CPI: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:15 AM
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన నేత.. నెల్లికంటి సత్యం పేరును సీపీఐ ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన నేత.. నెల్లికంటి సత్యం పేరును సీపీఐ ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. పదవులను బాధ్యతగా భావిస్తామని చెప్పడమే కాకుండా ఆచరించే నాయకుల్లో ముందు వరసలో ఉంటారనే పేరు ఆయనకు ఉంది. సత్యం స్వస్థలం.. నల్లగొండ జిల్లాలోని ఎలగలగూడెం గ్రామం.
విద్యార్థి దశ నుంచే ఆయన వామపక్ష భావజాలంతో పెనవేసుకుపోయారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ సమస్యపైన, కాలుష్య కారక పరిస్థితులపైనా నెల్లికంటి సత్యం బలమైన ఉద్యమం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయానికి కృషిచేసి అధిష్ఠానం మన్ననలు పొందారు. ఉప ఎన్నిక, 2023ఎన్నికల సందర్భంగా అధిష్ఠానం.. సత్యం సేవలను గుర్తిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆయనకి ఈ అవకాశం ఇచ్చింది.