Share News

CPI K Narayana: రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిన బీజేపీ

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:25 AM

ప్రధాని కార్యాలయం ఏది చెబితే.. రాష్ట్రపతి భవన్‌ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు.

CPI K Narayana: రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిన బీజేపీ

  • అధికారాన్ని కేంద్రీకృతం చేసే యత్నాలు

  • సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలో కె.నారాయణ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/గాజులరామారం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాని కార్యాలయం ఏది చెబితే.. రాష్ట్రపతి భవన్‌ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో నిర్వహిస్తున్న సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభ రెండో రోజు గురువారం నారాయణ ప్రసంగించారు. సీబీఐ, ఈడీ, నీతి ఆయోగ్‌, న్యాయ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. 30 రోజులు జైల్లో ఉన్న చట్టసభల సభ్యుల పదవులను రద్దు చేసేందుకు బీజేపీ చట్టం తేవాలనుకుంటే.. రెండేళ్లు జైల్లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదవినే తొలుత రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సాగుతున్న బీసీల పోరాటానికి సీపీఐ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సతో సీపీఐకి పొత్తు ఉన్నప్పటికీ రేవంత్‌ సర్కారు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న ట్రాన్స్‌జెండర్లకు కూడా పార్టీలో సభ్యత్వం కల్పించాలని, వారి సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 05:25 AM