TG High Court: కారుణ్య నియామకానికి.. వివాహమైన కుమార్తె అర్హురాలే
ABN , Publish Date - Apr 11 , 2025 | 03:43 AM
వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని హైకోర్టు పేర్కొంది. ఆర్థికస్థితి ఆధారంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించగా, 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు

మృతి చెందిన ఓ ఏఎస్సై కుమార్తె పిటిషన్‌పై హైకోర్టు స్పష్టీకరణ
నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): వివాహమైన కుమార్తె సైతం కారుణ్య నియామకానికి అర్హురాలేనని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ఉద్యోగం ఇవ్వాలని తెలిపింది. రియాసత్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ యూనస్ 1989లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ 2022లో చనిపోయారు. అనారోగ్యంతో ఉన్న ఆయన భార్య షహీన్ సుల్తానా బాగోగులను వివాహమైన కుమార్తె ఫాతిమా చూసుకుంటున్నారు. తల్లి పోషణ దృష్ట్యా అర్హతలున్న తనకు ఉద్యోగం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దానిని తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తన భర్తకు ఉద్యోగం ఉందో లేదో అన్న విషయాన్ని వెల్లడించలేదని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలు కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలే అని పేర్కొంది. నిబంధనల ప్రకారం ఆర్థికస్థితి, ఇతర ధ్రువపత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనిపై 8వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది.